గుండెపోటుతో అంగన్‌వాడీ టీచర్ పుష్పలత మృతి..
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సీడీపీఓ
కడెం (ఆంధ్రప్రభ): కడెం మండలం మాసాయిపేట్ గ్రామంలోని రెండో అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న కుక్కరికారి పుష్పలత (41) గుండెపోటుతో మృతి చెందారు. గత 14 సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతూనే విధులు నిర్వహిస్తున్న ఆమెకు ఐదు రోజుల క్రితం ఆరోగ్యం విషమించడంతో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలో బుధవారం రాత్రి ఆకస్మికంగా గుండెపోటు రావడంతో ఆమె కన్నుమూశారు. మృతురాలికి భర్త కె. రాజేశ్వర్ (కడెం మండల రేషన్ షాప్ డీలర్ల సంఘం అధ్యక్షుడు), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
పుష్పలత మృతిపై ఖానాపూర్ సీడీపీఓ నాగలక్ష్మి, కడెం మండల ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు షహనాజ్ పర్వీన్, రాధ, మాసాయిపేట్ ఇన్‌చార్జి సర్పంచ్ ఏట్టం రాజవ్వ, మాజీ సర్పంచులు డాక్టర్ ఎం. రాముగౌడ్, రత్నాల పోశం, స్థానిక రేషన్ షాప్ డీలర్ షేక్ అజీజ్, కడెం మండల రేషన్ షాప్ డీలర్లు, అంగన్‌వాడీ టీచర్లు, పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం సీడీపీఓ నాగలక్ష్మి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, అంత్యక్రియల ఖర్చుల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.20 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
