ఓటు హక్కు చాలా విలువైనది..
బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవిందు
శ్రీ సత్యసాయి, జులై 16 (ఆంధ్రప్రభ): ఓటు హక్కు ప్రతి పౌరుడి అత్యంత విలువైన రాజ్యాంగబద్ధమైన హక్కు అని, దానిని ప్రాణం కన్నా గొప్పదిగా భావించాలని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవిందు పిలుపునిచ్చారు. గురువారం శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారతదేశంలోని ప్రతి వయోజన పౌరుడికి ఓటు హక్కు సులభంగా లభించలేదని, దాని వెనుక డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన చారిత్రక పోరాటం ఉందన్నారు. రెండవ రౌండ్ టేబుల్ సమావేశాల సమయంలో మహాత్మా గాంధీ చదువుకున్న వారికి మాత్రమే, జవహర్లాల్ నెహ్రూ పన్నులు చెల్లించే వారికి మాత్రమే, సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఉన్నత కులాల వారికి మాత్రమే ఓటు హక్కు ఇవ్వాలనే ప్రతిపాదనలు చేసినప్పటికీ, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి కుల, మత, భాష, ప్రాంత, లింగ భేదం లేకుండా వయోజనులందరికీ ఓటు హక్కు సాధించారని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని ప్రతి పౌరుడు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఓటరు నమోదు ప్రక్రియకు ఎన్నికల సంఘం గడువును జూలై 24, 2026 వరకు పొడిగించిందని, ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకుని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రాజ్యాంగం ప్రజలకు ఓటు హక్కు కల్పించడం వల్లే రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కనీసం కొంత మేర అయినా అమలు చేయాల్సి వస్తోందని గోవిందు అన్నారు. ప్రజాస్వామ్యంలో రక్తపాతం లేకుండా ప్రభుత్వాలను మార్చగలిగే అపార శక్తి ఒక్క ఓటుకు మాత్రమే ఉందని చెప్పారు. అందువల్ల ఓటు విలువను ప్రతి పౌరుడు గుర్తించాలని సూచించారు.
ఎన్నికల సమయంలో మద్యం, డబ్బు లేదా ఇతర ప్రలోభాలకు లొంగి ఓటు వేయడం ద్వారా ప్రజలు తమ భవిష్యత్తును తామే నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్వల్ప మొత్తానికి ఓటు విక్రయించిన ప్రజలు, అనంతరం అధికారంలోకి వచ్చిన వ్యక్తులు లేదా పార్టీలు కోట్లాది రూపాయలు సంపాదిస్తూ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా పాలన సాగించే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. దీనివల్ల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణమైన పాలన అమలుకావడం లేదని వ్యాఖ్యానించారు.
కాబట్టి ప్రతి ఓటరుడు తన ఓటును సాధారణ కాగితం ముక్కలా కాకుండా అత్యంత విలువైన రాజ్యాంగ హక్కుగా భావించి, ఆలోచించి వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఓటు హక్కును కాపాడుకోవడం ద్వారా రాజ్యాంగ విలువలను పరిరక్షించవచ్చని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బహుజన నాయకులు రొడార్పు హరిప్రసాద్, రిటైర్డ్ టీచర్ నరసింహులు, గాదలపురి నారాయణస్వామి, ప్రసాద్, నరసింహులు, తిరుపాలు తదితరులు పాల్గొన్నారు.
