NEWS@05:00 P.M | 15 జూలై 2026 ముఖ్యాంశాలు
NEWS@05:00 P.M | 15 జూలై 2026 ముఖ్యాంశాలు
Telugu Academy | తెలుగు అకాడమీ పగ్గాలు భట్టు రమేష్‌కు..
తెలంగాణ తెలుగు అకాడమీ నూతన డైరెక్టర్‌గా ఆచార్య భట్టు రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్‌గా, సీనియర్ అధ్యాపకుడిగా సేవలందించిన భట్టు రమేష్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. తెలుగు భాష పరిరక్షణ, పాఠ్యపుస్తకాల రూపకల్పన, సాహిత్య అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే తెలుగు అకాడమీకి ఆయన నియామకం పట్ల విద్యావేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులు, సాహితీవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Swachhata Pakhwada | విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన కేంద్ర మంత్రి
హైదరాబాద్‌లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో నిర్వహించిన స్వచ్ఛతా పఖ్వాడా కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపీతో కలిసి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తోందని వారు పేర్కొన్నారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కేంద్ర మంత్రి సురేష్ గోపీ ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌కు రావడం స్వచ్ఛతపై ఉన్న నిబద్ధతకు నిదర్శనమని విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, బోధన మరియు బోధనేతర సిబ్బంది చూపిన ఉత్సాహం, అంకితభావాన్ని అభినందించారు. పాఠశాల ప్రాంగణంలో పరిశుభ్రతపై అవగాహన కల్పించడంతో పాటు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని, పరిశుభ్రతను కేవలం కార్యక్రమంగా కాకుండా జీవన విధానంగా అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
న్యూజెర్సీలో రోడ్డు ప్రమాదం.. వినుకొండ విద్యార్థిని మృతి..
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన యువతి మక్కెన ప్రసన్న(27) న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.
సాధారణ రైతు కుటుంబానికి చెందిన మక్కెన వెంకటేశ్వర్లు, గోవిందమ్మ దంపతులకు ముగ్గురు సంతానం.వారిలో పెద్ద కుమార్తె ప్రసన్న 2022లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లింది. అక్కడ ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది.
Revanth Reddy | ‘సీఎం హోదాకు తగ్గట్టుగా మాట్లాడాలి’
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సీఎం హోదాను మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. హోం శాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులు, మేధావులు, రిటైర్డ్ ఇంజనీర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Revanth Reddy Vote | రేవంత్‌కు రెండుచోట్ల ఓటు
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఓటు వ్యవహారంపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డికి కొడంగల్, కొండారెడ్డిపల్లి ప్రాంతాల్లో రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఇది ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ఎన్నికల సంఘం వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉండకూడదని, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.
Education | విద్యను వ్యాపారంగా మార్చారు..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ విద్యా వ్యవస్థను వ్యాపారంగా మార్చిందని, విద్యా ప్రమాణాలు దిగజారేలా వ్యవహరిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని బోయినపల్లిలో నిర్వహించిన ‘ఛత్రోంకి గూంజ్’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Food Safety | ప్రజారోగ్యంపై రాజీ లేదు..
ప్రజలకు నాణ్యమైన ఆహారం, సురక్షితమైన మందులు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని పేర్కొంటూ.. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ విభాగాల పనితీరు, ఎదురవుతున్న సవాళ్లు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి చర్చించారు.
Congress | ఇలా అయితే మళ్లీ గెలవలేం
తెలంగాణ కాంగ్రెస్‌లో పార్టీ పరిస్థితి, అంతర్గత విభేదాలపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టి సారించారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలతో వరుస సమావేశాలు నిర్వహించిన ఆమె.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. పార్టీలో చిన్నచిన్న అంశాలపై నేతలు బహిరంగంగా విభేదిస్తే ప్రజల్లో ప్రతికూల సంకేతాలు వెళ్తాయని, ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్ ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవుతాయని ఆమె హెచ్చరించినట్లు సమాచారం.
Jawaharnagar Dumpyard | బాధితులకు అండగా ఉంటా..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్‌లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను జవహర్‌నగర్ డంప్‌యార్డ్ వ్యతిరేక పోరాట అఖిలపక్ష నేతలు, జేఏసీ ప్రతినిధులు, స్థానిక ప్రజలు కలిశారు. జవహర్‌నగర్ డంప్‌యార్డ్ వల్ల ఎదురవుతున్న సమస్యలను వారు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు రెండు దశాబ్దాలుగా చెత్త కుప్పలు, కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు.
TTD | ఒక్కరోజే దాదాపు రూ.97 కోట్ల విరాళాలు..
తిరుమలేశునికి విరాళాలు సమర్పించే దాతలకు కల్పించే సౌకర్యాలలో మార్పుచేర్పుల నిర్ణయం నేపథ్యంలో టి టి డి నిన్న ఒక్కరోజే విరాళాలు వెల్లువెత్తాయి. అధికారిక సమాచారం ప్రకారం ఈ నెల 14వ తేదీ ఒక్కరోజే రూ 96.98 కోట్ల విరాళాలను దాతలు సమర్పించారు. అందులో 1,212 మంది రూ 1 లక్ష నుంచి రూ 10 లక్షల వరకు సమర్పించినవారు కాగా 1,246 మంది రూ.10లక్షల నుంచి రూ.25 లక్షల వరకు సమర్పించినవారున్నారు. ఇద్దరు భక్తులు రూ.1 కోటి కన్నా ఎక్కువ విరాళాలను సమర్పించారు.
CLICK HERE TO READ THE FULL STORIES
