Jawaharnagar Dumpyard | బాధితులకు అండగా ఉంటా..
జవహర్‌నగర్ డంప్‌యార్డ్‌పై పోరాటం ఉధృతం.. ఈటల రాజేందర్
డంప్‌యార్డ్ సమస్యను పార్లమెంట్లో ప్రస్తావిస్తా..
సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తానని ఎంపీ హామీ
Jawaharnagar Dumpyard | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ :మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్‌లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను జవహర్‌నగర్ డంప్‌యార్డ్ వ్యతిరేక పోరాట అఖిలపక్ష నేతలు, జేఏసీ ప్రతినిధులు, స్థానిక ప్రజలు కలిశారు. జవహర్‌నగర్ డంప్‌యార్డ్ వల్ల ఎదురవుతున్న సమస్యలను వారు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు రెండు దశాబ్దాలుగా చెత్త కుప్పలు, కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు.
పోరాటానికి నాయకత్వం వహించాలని విజ్ఞప్తి
డంప్‌యార్డ్ తరలింపు కోసం కొనసాగిస్తున్న తమ ఉద్యమానికి పార్టీలకు అతీతంగా నాయకత్వం వహించాలని అఖిలపక్ష నేతలు ఈటల రాజేందర్‌ను కోరారు. గతంలో నిరసనల సందర్భంగా అరెస్టు చేసిన ఆందోళనకారులకు ఈటల సంఘీభావం తెలిపారని గుర్తు చేస్తూ, తమ పోరాటానికి మద్దతు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి జవహర్‌నగర్ డంప్‌యార్డ్ సమస్యపై స్పందించి తరలింపు హామీ ఇచ్చారని, కానీ ఇప్పటివరకు పూర్తి స్థాయి పరిష్కారం కాలేదని పలువురు నేతలు ఆరోపించారు.

సమస్య పరిష్కారం వరకు పోరాటం: ఈటల
అఖిలపక్ష నేతల విజ్ఞప్తిపై ఈటల రాజేందర్ స్పందిస్తూ.. జవహర్‌నగర్ ప్రజల సమస్య పరిష్కారం కోసం తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ప్రజలంతా రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపైకి రావడం అభినందనీయమని అన్నారు. డంప్‌యార్డ్ పరిసరాల్లో నివసిస్తున్న ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. డంప్‌యార్డ్ సమస్యపై గతంలోనూ తాను పోరాడుతున్నానని, శాశ్వత పరిష్కారం కోసం అధికారులతో చర్చలు జరిపానని తెలిపారు. గత ఒప్పందాల ప్రకారం పనులు జరగాల్సిన అవసరం ఉందన్నారు.
పార్లమెంట్లో ప్రస్తావిస్తా
డంప్‌యార్డ్ అంశాన్ని రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తానని ఈటల రాజేందర్ తెలిపారు. జవహర్‌నగర్ ప్రజల సమస్యలను దేశ రాజధాని వరకు తీసుకెళ్తానని చెప్పారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా పోరాడాలని సూచించిన ఆయన.. సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రజల వెంట ఉంటానని భరోసా ఇచ్చారు.
