ఎరువుల అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు: కలెక్టర్ రాహుల్ శర్మ
గణపురం (ఆంధ్రప్రభ): రైతులకు ఎరువుల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలోని ఎరువుల గోదాములను జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, మండల వ్యవసాయ అధికారి దేశబోయిన ఐలయ్యతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా రైతులు యాప్ ద్వారా బుక్ చేసుకున్న ఎరువుల వివరాలు, గోదాములో ఉన్న నిల్వలు, పంపిణీ రిజిస్టర్లు, స్టాక్ వివరాలను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా ఎరువులు పంపిణీ చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మండల ప్రత్యేక అధికారి అశోద కుమారస్వామి, తహసీల్దార్ అడ్లూరి రాజేశ్వర్‌రావు, ఎంపీడీవో భాస్కర్, వ్యవసాయ విస్తరణ అధికారి పవన్ తదితరులు పాల్గొన్నారు.
