తిరుపతిలో రూ.255 కోట్ల ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్క్.. వెయ్యి మందికి ఉపాధి
తిరుపతిలో రూ.255 కోట్ల ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్క్.. వెయ్యి మందికి ఉపాధి
- సత్యవేడు సమీపంలో 63 ఎకరాల భూమి కేటాయింపు
- నెక్సస్ సంస్థకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం
- రూ.255 కోట్ల పెట్టుబడితో లాజిస్టిక్స్ హబ్ ఏర్పాటు
- 400 ప్రత్యక్ష, 600 పరోక్ష ఉద్యోగాలకు అవకాశం
- ఏపీ లాజిస్టిక్స్ పాలసీ-2026 కింద ప్రోత్సాహకాలు
అమరావతి, ఆంధ్రప్రభ: చెన్నై-తిరుపతి పారిశ్రామిక కారిడార్‌కు అనుసంధానంగా లాజిస్టిక్స్ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం చిన్నఎట్టివాకం గ్రామంలో 63.01 ఎకరాల ఏపీ మారిటైమ్ బోర్డు (ఏపీఎంబీ) భూమిని ఎంఎస్ నెక్సస్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్క్ సంస్థకు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది.
ఈ భూమిపై రూ.255 కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు వెయ్యి మందికి ఉపాధి లభించనుంది. ఈ మేరకు మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రతిపాదిత ప్రాజెక్టులో మొత్తం రూ.255 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఇందులో రూ.89.25 కోట్లు ప్రమోటర్ల ఈక్విటీ, రూ.165.75 కోట్లు బ్యాంకు రుణాల రూపంలో సమకూరనున్నాయి. ప్రాజెక్టు పూర్తయితే 400 మందికి ప్రత్యక్ష, 600 మందికి పరోక్ష ఉద్యోగాలతో కలిపి సుమారు వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి.
ఏపీ మారిటైమ్ బోర్డు సీఈఓ సమర్పించిన ప్రతిపాదనను రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఏపీఎస్ఐపీసీ) పరిశీలించి, జూలై 7న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో చర్చించింది. కమిటీ సిఫార్సులను ఆమోదించిన ఎస్ఐపీబీ, భూమి కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం తుది ఉత్తర్వులు జారీ చేసింది.
చిన్నఎట్టివాకం గ్రామంలోని 63.01 ఎకరాల భూమిని ఎకరాకు రూ.28 లక్షల చొప్పున పూర్తిస్థాయి విక్రయ ప్రాతిపదికన సంస్థకు కేటాయించనున్నారు. భూమిపై ఉన్న నిర్మాణాల విలువ, పరిపాలనా ఛార్జీలు, ఏపీ మారిటైమ్ బోర్డు ప్రాసెసింగ్ ఫీజులు కూడా సంస్థే చెల్లించాల్సి ఉంటుంది.
భూసేకరణ నుంచి అభివృద్ధి వరకు వచ్చే మొత్తం వ్యయాన్ని డెవలపరే భరించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతిపాదిత భూమిని సంబంధిత భూయజమానుల సమ్మతితో ఏపీ మారిటైమ్ బోర్డు సేకరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అనంతరం ఏపీఎంబీ భూమిని నెక్సస్ సంస్థకు కేటాయించనుంది.
ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ పాలసీ-2026 కింద వర్తించే రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా అందించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ప్రాజెక్టు అమలుకు అవసరమైన తదుపరి చర్యలు చేపట్టాలని ఏపీ మారిటైమ్ బోర్డు సీఈఓను ప్రభుత్వం ఆదేశించింది.
