ఖో-ఖో జట్టుకు గారకుంట తండా బిడ్డ ఎంపిక
గరిడేపల్లి (ఆంధ్రప్రభ): మండలంలోని గారకుంట తండాకు చెందిన గిరిజన క్రీడాకారిణి గుగులోతు శైలజ ప్రతిభతో పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఖో-ఖో జట్టుకు ఎంపికైంది. అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన శైలజ జాతీయ స్థాయి యూనివర్సిటీ జట్టులో చోటు దక్కించుకోవడంతో స్థానికులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుగులోతు నీలా హేమ్లా నాయక్ శైలజను అభినందించారు. పేదరికాన్ని జయిస్తూ పట్టుదలతో క్రీడల్లో రాణించిన శైలజ తమ తండాకే కాకుండా ఈ ప్రాంతానికే గర్వకారణంగా నిలిచిందని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. శైలజ విజయాన్ని పురస్కరించుకుని తండాలో అభినందన కార్యక్రమం నిర్వహించగా, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, గ్రామ పెద్దలు, తండా వాసులు పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
