Mother Daughter Death | తల్లి మరణ వార్త విని.. కూతురు మృతి
తాడ్వాయి, ఆంధ్రప్రభ: తల్లి మరణ వార్త విన్న కూతురు గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో చోటుచేసుకుంది. ఒకే సమయంలో తల్లి, కూతురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళితే.. చిట్యాల గ్రామానికి చెందిన మంగలి నర్సవ్వ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కూతురు, ధర్మారావుపేట గ్రామానికి చెందిన మహిళ, తల్లిని చూసేందుకు ఇంటికి వచ్చింది. తల్లి ఆరోగ్యం విషమించడంతో ఆమె నోట్లో పాలు పోసి పక్కకు వెళ్లిన వెంటనే నర్సవ్వ మృతి చెందింది. తల్లి మరణించిన విషయం తెలుసుకున్న కూతురు ఒక్కసారిగా షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందింది.
తల్లి, కూతురు ఒకే రోజు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, కుల సంఘ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇదిలా ఉండగా, రెండు నెలల క్రితమే నర్సవ్వ కుమారుడు మెదక్ బస్టాండ్ ఆవరణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వరుస విషాదాలతో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి తీవ్ర మానసిక వేదనలో ఉందని గ్రామస్తులు తెలిపారు.
