కడియంపై సురేఖ ఫిర్యాదు.. మీనాక్షి కీలక సూచన
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదం తాజాగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి చేరింది. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ ఆమెతో భేటీ అయి తన అభ్యంతరాలను వివరించారు.
భేటీలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, అనవసర వివాదాల్లోకి తనను లాగుతున్నారని సురేఖ ఫిర్యాదు చేశారు. ఇద్దరి మధ్య ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను కూడా ఆమె మీనాక్షి నటరాజన్‌కు వివరించారు.
మంత్రి చెప్పిన విషయాలను ఓపికగా విన్న మీనాక్షి నటరాజన్, వివాదాన్ని మరింత పెద్దది చేయకుండా సంయమనంతో వ్యవహరించాలని సూచించినట్లు సమాచారం. కాగా, కడియం శ్రీహరితో నెలకొన్న విభేదాలపై మంత్రి కొండా సురేఖ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్లను కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
