‘నమస్తే’తో పారిశుద్ధ్య కార్మికులకు భరోసా
రూ.5 లక్షల రుణం, ఆరోగ్య బీమా, రక్షణ పరికరాలు..
అర్హులంతా వెంటనే నమోదు చేసుకోవాలి : కలెక్టర్ వెంకటేశ్వర్
తిరుపతి, ఆంధ్రప్రభ : పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం, భద్రత, ఆర్థిక సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నమస్తే’ (NAMASTE) పథకాన్ని ప్రతి అర్హుడు సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. మంగళవారం తిరుపతిలోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన నమస్తే దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పథకం ద్వారా లభించే ప్రయోజనాలపై పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజ పరిశుభ్రతను కాపాడడంలో పారిశుద్ధ్య కార్మికులు, రాగ్ పికర్లు, డోర్ టు డోర్ వ్యర్థాల సేకరణ సిబ్బంది, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బంది అందిస్తున్న సేవలు అమూల్యమైనవని అన్నారు. వారి సేవలను గుర్తించి గౌరవప్రదమైన జీవనం, సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నమస్తే పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.
ఈ పథకం ద్వారా పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు, ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు, ఆరోగ్య భద్రత, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. వ్యర్థాల సేకరణ కోసం ఆటోలు, ఇతర వాహనాల కొనుగోలుకు రూ.5 లక్షల వరకు వడ్డీ రాయితీతో కూడిన రుణ సదుపాయం అందుబాటులో ఉందన్నారు. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో డ్రై వేస్ట్ కలెక్షన్ సెంటర్ల ఏర్పాటుతో వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పారిశుద్ధ్య కార్మికులకు గ్లోవ్స్, బూట్లు, మాస్కులు, శానిటైజర్లు, క్యాప్‌లు వంటి వ్యక్తిగత రక్షణ పరికరాలను ప్రభుత్వం అందజేస్తోందని చెప్పారు. అనారోగ్య పరిస్థితుల్లో రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యంతో పాటు, వారి పిల్లలకు పదో తరగతి వరకు ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్లు కూడా అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
నమస్తే పథకం ప్రయోజనాలు పొందేందుకు అర్హులైన పారిశుద్ధ్య కార్మికులు ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్, ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్ వివరాలను గ్రామ పంచాయతీ కార్యదర్శులు లేదా సంబంధిత అధికారులకు అందజేసి నమోదు పూర్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
తిరుచానూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించిన అధికారులను ఆయన అభినందించారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి సుశీల దేవితో కలిసి పారిశుద్ధ్య కార్మికులకు కొబ్బరి నూనె, డెటాల్ లిక్విడ్, సబ్బులు, గ్లోవ్స్, మాస్కులు తదితర వ్యక్తిగత పరిశుభ్రత, భద్రతకు అవసరమైన సామగ్రిని పంపిణీ చేశారు. విధుల నిర్వహణలో వ్యక్తిగత రక్షణ పరికరాలను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ సురేష్ నాయుడు, సంబంధిత శాఖల అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
