పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
జులై 16 నుంచి 21 వరకు దరఖాస్తుల స్వీకరణ..
విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : ప్రిన్సిపాల్ అశ్రిఫ్ అలీ
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : మండలంలోని చిన్నముష్టూరు గ్రామం వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ అశ్రిఫ్ అలీ తెలిపారు.
మంగళవారం ఆయన మాట్లాడుతూ, ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు అర్హత కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి, ఆన్‌లైన్ ద్వారా లేదా హెల్ప్‌లైన్ సెంటర్లలో దరఖాస్తు చేసుకుని సర్టిఫికెట్ల ధ్రువీకరణ పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఉరవకొండ, గుంతకల్లు, వజ్రకరూరు, బెలుగుప్ప, కూడేరు మండలాల విద్యార్థుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం యశస్వి, ప్రగతి స్కాలర్‌షిప్‌లు అందజేస్తుందని, అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కూడా ఉంటుందని చెప్పారు. నిబంధనల మేరకు హాస్టల్ వసతి, ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తామని పేర్కొంటూ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సివిల్ ఇంజినీరింగ్ శాఖాధిపతి డాక్టర్ సులోచన, ఎలక్ట్రికల్ విభాగాధిపతి డాక్టర్ నిత్యా లావణ్య తదితరులు పాల్గొన్నారు.
