టీటీడీ కొత్త దాతల విధానం.. సామాన్య భక్తులకే పెద్దపీట !
- టీటీడీ బోర్డు కీలక భేటీ..
- 62 అంశాలపై నిర్ణయాలు
- బ్రేక్ దర్శనాల్లో కీలక మార్పులు
- రూ.10 లక్షల దాతలకు ఏడాదికి ఒక్కసారే బ్రేక్ దర్శనం
- జీవితకాల సౌకర్యాలు ఇక 20 ఏళ్లకే పరిమితం
- భక్తుల సౌకర్యాలు.. మౌలిక వసతుల అభివృద్ధికి కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రభ, తిరుమల : తిరుమలలో సామాన్య భక్తుల దర్శనానికి మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. దాతలకు కల్పిస్తున్న సౌకర్యాలను హేతుబద్ధీకరిస్తూ కొత్త దాతల విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు టీటీడీ ఈవో రవిచంద్ర వెల్లడించారు. కొత్త విధానం మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. అయితే ఇప్పటికే విరాళాలు అందించిన దాతలకు ప్రస్తుతం అమల్లో ఉన్న సౌకర్యాల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.
తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన మంగళవారం ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్యచౌదరితో పాటు పాలకమండలి సభ్యులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. మొత్తం 62 అంశాల అజెండాపై సమావేశంలో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కొత్త విధానం ప్రకారం రూ.10 లక్షలు విరాళంగా అందించే భక్తులకు గతంలో ఏడాదికి మూడుసార్లు లభిస్తున్న బ్రేక్ దర్శనాన్ని ఇకపై ఏడాదికి ఒక్కసారికి మాత్రమే పరిమితం చేయనున్నారు. అదనంగా మరోసారి సుపథం ద్వారా దర్శనం కల్పిస్తారు. అలాగే వ్యక్తిగతంగా విరాళాలు అందించే దాతలకు ఇప్పటివరకు కల్పిస్తున్న జీవితకాల సౌకర్యాలను 20 సంవత్సరాలకు పరిమితం చేయాలని పాలకమండలి నిర్ణయించింది.
భక్తుల కోసం శాశ్వత షెల్టర్లు…
టీటీడీ పాలకమండలి సమావేశంలో భక్తుల సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. రూ.6.31 కోట్ల వ్యయంతో తిరుమలలో ఎస్ఎస్డీ టోకెన్లు పొందిన భక్తులు వేచి ఉండేందుకు ఆళ్వార్ ట్యాంక్ సమీపంలో శాశ్వత షెల్టర్లు, క్యూలైన్లు, మరుగుదొడ్లు నిర్మించేందుకు టెండర్లకు పచ్చజెండా ఊపింది. కుమారధార, పసుపుధార జలాశయాల భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు రూ.2.77 కోట్లతో రెండు వరుసల వంతెన నిర్మాణానికి ఆమోదం తెలిపింది.
25 ఏళ్లపాటు టీటీడీకి ఉచిత విద్యుత్..
తిరుమలలో హరిత విద్యుత్‌ను ప్రోత్సహించే దిశగా జీఎన్సీ సమీపంలో 800 కిలోవాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి యంత్రాన్ని విరాళంగా ఏర్పాటు చేసే ప్రతిపాదనకు పాలకమండలి ఆమోదం తెలిపింది. దీని ద్వారా టీటీడీకి 25 సంవత్సరాలపాటు ఉచిత విద్యుత్ లభించనుంది. కాకులమానుతిప్ప ప్రాంతంలో 25 ఏళ్లకు పైబడిన ఘన వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతుల్లో శుద్ధి చేసేందుకు రూ.5 కోట్లు కేటాయించారు. తిరుమల, తిరుపతిలోని టీటీడీ ఆలయాలు, విశ్రాంతి భవనాల్లో అగ్నిమాపక వ్యవస్థల నిర్వహణ కోసం రూ.2.35 కోట్లతో పనులు కొనసాగించాలని నిర్ణయించారు. ఆక్టోపస్ బేస్ క్యాంప్‌లో అదనపు మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2.26 కోట్లు, మూడు సంవత్సరాల నిర్వహణ సేవలకు రూ.65 లక్షలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు.
ఒంటిమిట్ట స్వామివారికి బంగారు కవచాలు
ఒంటిమిట్ట శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామివారి మూలవిరాట్టులకు బంగారు కవచాల తయారీ కోసం టీటీడీ ఖజానాలోని బంగారాన్ని వినియోగించేందుకు పాలకమండలి అనుమతి ఇచ్చింది. ఒంటిమిట్ట ఆలయం వద్ద రూ.17.84 కోట్లతో 100 గదుల విశ్రాంతి గృహం నిర్మించేందుకు టెండర్లను ఆమోదించింది. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ముఖ మండపంపై సాలహారం, ప్రాకార గోడ నిర్మాణానికి ఇప్పటికే మంజూరైన రూ.50 లక్షలకు అదనంగా రూ.15.30 లక్షలు కేటాయించారు.
విజిలెన్స్‌లో 120 కొత్త పోస్టులు
టీటీడీ విజిలెన్స్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు డిప్యుటేషన్ ప్రాతిపదికన 120 పోస్టుల సృష్టికి ప్రభుత్వ అనుమతి కోరాలని పాలకమండలి నిర్ణయించింది. భద్రత, విజిలెన్స్ గార్డుల నియామకంలో ప్రస్తుతం అమల్లో ఉన్న మాజీ సైనికులు–పౌరుల నిష్పత్తిని రద్దు చేసి, ఇకపై పౌరుల నుంచే ప్రత్యక్ష నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వ అనుమతి కోరనుంది.
అలాగే సత్యసాయి జిల్లా లేపాక్షిలో రూ.6.40 కోట్లతో టీటీడీ కల్యాణ మండపం నిర్మాణానికి పాలకమండలి ఆమోదం తెలిపింది. భక్తులకు మెరుగైన దర్శన, వసతి, భద్రతా సౌకర్యాలు కల్పించడంతో పాటు తిరుమలలో మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేసే దిశగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
