ఇస్నాపూర్ భూములపై నిషేధం ఎత్తివేయాలి: బిల్డర్స్ అసోసియేషన్

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ గ్రామ సర్వే నంబర్లు 282/1, 496 భూములపై విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేసి, సాధారణ రిజిస్ట్రేషన్ ప్రక్రియలను పునరుద్ధరించాలని ఇస్నాపూర్ బిల్డర్స్ అసోసియేషన్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. అసోసియేషన్ అధ్యక్షుడు అబీద్ బిన్ మొహద్, కార్యదర్శి సుధర్శన్ రెడ్డి బొగతి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. జూన్ 3 నుంచి ఇస్నాపూర్‌లోని తేజా కాలనీ, హైదరాబాద్ ల్యాంప్స్, రుక్మిణి వెంచర్స్, కావ్య వెంచర్స్ తదితర లేఅవుట్లలో ప్లాట్లు, గృహాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో వేలాది మంది కొనుగోలుదారులు, నివాసితులు, బిల్డర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.

బ్యాంకు రుణాలు తీసుకున్న వారు ఈఎంఐలు చెల్లించలేక ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. అదేవిధంగా ఫ్రీడమ్ ఫైటర్స్, మాజీ సైనికులు, జీఓ ఎంఎస్ నంబర్లు 58, 59 కింద లబ్ధి పొందిన వారి ఆస్తుల రిజిస్ట్రేషన్లు కూడా సంగారెడ్డి, పటాన్‌చెరు సబ్‌-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిలిచిపోవడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని వివరించారు. ఇప్పటికే చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి హక్కులను పరిరక్షించడంతో పాటు సర్వే నంబర్ 282/1ను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు సమగ్ర విచారణ చేపట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ కోరింది. ఈ సమస్యతో వేలాది కుటుంబాలు ప్రభావితమవుతున్నందున ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.