కోర్టులో క్షుద్రపూజల కలకలం..

  • జడ్జి కుర్చీపై చేత‌బ‌డి..
  • అనుకూల తీర్పు కోసం క్షుద్రపూజలు..
  • 65 ఏళ్ల మహిళ అరెస్ట్

ఆంధ్రప్రభ : తనకు అనుకూలంగా తీర్పు రావాలనే ఉద్దేశంతో న్యాయమూర్తి కుర్చీపైనే క్షుద్రపూజలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 65 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని చిక్కబళ్లాపురంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం.. చిక్కబళ్లాపురానికి చెందిన మంజుల అనే మహిళకు సంబంధించిన ఓ కేసు మొదటి అదనపు సీనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణలో ఉంది. ఈ కేసులో తీర్పు తనకు అనుకూలంగా రావాలనే ఉద్దేశంతో ఆమె న్యాయమూర్తి కుర్చీపై చేత‌బ‌డి చేసిన‌ట్టు ఆరోపణలు వచ్చాయి.

రెండు రోజుల క్రితం కోర్టులోకి వచ్చిన మంజుల న్యాయమూర్తి కుర్చీపై తెల్ల ఆవాలు చల్లుతున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ విషయం గుర్తించిన కోర్టు ప్రధాన పరిపాలనాధికారి నేత్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించి మంజులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితురాలిపై కర్ణాటక అమానుష దుష్టాచారాలు, క్షుద్రపూజల నివారణ చట్టం–2017 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.