ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఈ నెల 24లోగా పూర్తి చేయాలి: కలెక్టర్

నాగర్‌కర్నూల్ (ఆంధ్రప్రభ): ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను ఈ నెల 24లోగా పూర్తి చేసి అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ ఏమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు పరిధిలోని 112, 113 పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి ఓటర్ల నమోదు ప్రక్రియను పరిశీలించారు. పట్టణంలో ఇప్పటివరకు 32 శాతం మాత్రమే నమోదు పూర్తయిందని పేర్కొంటూ, బూత్ లెవల్ అధికారులు, బీఎల్‌ఏలు, మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ అధికారుల సమన్వయంతో ఈ నెల 24లోగా వంద శాతం నమోదు పూర్తి చేయాలని సూచించారు.

అనంతరం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో నిర్వహిస్తున్న సదరం శిబిరాన్ని సందర్శించి దివ్యాంగులకు జారీ చేస్తున్న ధ్రువపత్రాల ప్రక్రియ, కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ప్రత్యేక అవసరాలున్న వారికి ప్రాధాన్యత కల్పించి పారదర్శకంగా ధ్రువపత్రాలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే మహిళా కుట్టుమిషన్ శిక్షణ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలల యూనిఫాంల తయారీ కేంద్రాన్ని సందర్శించి ఆగస్టు 15లోపు విద్యార్థులందరికీ యూనిఫాంలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అర్చన, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ కిరణ్‌కుమార్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి, డీఆర్‌డీఏ అధికారి ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.