సింగపూర్ జూ తరహాలో విశాఖ జూను అభివృద్ధి చేస్తాం
జూ అభివృద్ధికి బడ్జెట్లో ప్రాధాన్యం..
సీఎస్ఆర్, ఎంపీ ల్యాడ్స్ నిధులు సమీకరించాలి :
స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
విశాఖపట్నం, ఆంధ్రప్రభ : విశాఖపట్నంలోని జూను సింగపూర్ జూ తరహాలో అభివృద్ధి చేసి దేశంలోనే ఆదర్శవంతమైన జంతు ప్రదర్శనశాలగా తీర్చిదిద్దాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. జూ సందర్శన సందర్భంగా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, జూ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

జూ ఆదాయం, నిర్వహణ వ్యయాల మధ్య ఉన్న బడ్జెట్ లోటును భర్తీ చేసే చర్యలు చేపట్టాలని సూచించారు. జూ నిర్వహణకు అవసరమైన అదనపు ఆర్థిక వనరులు సమకూర్చేందుకు ప్రభుత్వం, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. జూ అవసరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు.

కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులను అధికంగా సమీకరిస్తే జూ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని స్పీకర్ అభిప్రాయపడ్డారు. ప్రతి ఏడాది సీఎస్ఆర్ నిధుల ద్వారా కనీసం రూ.3 కోట్లు జంతు సంరక్షణకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఉత్తరాంధ్ర ప్రాంత ఎంపీలు తమ ఎంపీ ల్యాడ్స్ నిధుల్లో 10 శాతం జూ అభివృద్ధికి కేటాయించాలని కోరాలని అధికారులకు సూచించారు.
జూలో ఖాళీగా ఉన్న పోస్టులను అత్యవసరంగా భర్తీ చేయాలని, ఆర్థిక వనరులు సమకూరేలా ఆదాయ వృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. సందర్శకులను ఆకట్టుకునే వినోద కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మరిన్ని మౌలిక వసతులు కల్పించి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. రోజువారీ సందర్శకుల అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలను పెంచాలని, అత్యున్నత ప్రమాణాలతో క్యాంటీన్‌ను అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
జూ అభివృద్ధికి అవసరమైన నిధుల కోసం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని కలిసి కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తామని స్పీకర్ తెలిపారు. తిరుపతి వంటి సంస్థల నుంచి జంతు సంరక్షణ, జూల నిర్వహణకు నిధులు సమీకరించే అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించారు.
తాను అటవీశాఖ మంత్రిగా ఉన్న సమయంలో కంబాలకొండను వైల్డ్‌లైఫ్ శాంక్చువరీగా ప్రకటించి ఆక్రమణలను అరికట్టామని గుర్తు చేశారు. జూ అవసరాలపై సమగ్ర నివేదికను అధికారులు అందజేస్తే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు హామీ ఇచ్చారు.
