జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధం
జూలై 16న ఇస్కాన్ ఆధ్వర్యంలో…
రథంపై జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి దివ్య విహారం..
మూడు రోజులపాటు భజనలు, హరినామ సంకీర్తనలు, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు
మహాప్రసాద పంపిణీ, పలు కళల ప్రదర్శన, పిల్లలకు ప్రత్యేక కార్యక్రమాలతో విశేష ఏర్పాట్లు.
కుటుంబ సమేతంగా విచ్చేసి జగన్నాథుని కృపకు పాత్రులు కావాలని ఇస్కాన్ పిలుపు
విజయవాడ, ఆంధ్రప్రభ : జగన్నాథ స్వామి భక్తులకు ఆధ్యాత్మిక పరవశ్యాన్ని పంచే శ్రీ జగన్నాథ రథయాత్ర–2026 మహోత్సవాలకు విజయవాడ నగరం సిద్ధమైంది. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించనున్న రథయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొనేలా విస్తృత ఏర్పాట్లు చేశారు. మూడు రోజులపాటు జరిగే ఈ మహోత్సవాల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఇస్కాన్ నిర్వాహకులు వెల్లడించారు. జూలై 16న ఉదయం 6 గంటలకు మంగళ ఆరతితో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
అనంతరం మధ్యాహ్నం 1 గంటకు శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ఉత్సవ విగ్రహాలకు మహా అభిషేకం నిర్వహిస్తారు. ప్రత్యేకంగా అలంకరించిన మహారథంపై దివ్య విగ్రహాలను ప్రతిష్ఠించి నగర వీధుల్లో భక్తుల మధ్య వైభవంగా ఊరేగిస్తారు. రథాన్ని వేలాది మంది భక్తులు స్వయంగా లాగుతూ సేవ చేసే అరుదైన అవకాశం కల్పించనున్నారు. జగన్నాథ నామస్మరణతో నగరం అంతా భక్తి పారవశ్యంలో మునిగిపోనుంది. రథయాత్ర సందర్భంగా హరినామ సంకీర్తనలు, భజనలు, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు, కీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది.
పుష్పాలతో సుందరంగా అలంకరించిన రథం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుండగా, మహిళలు, యువత, చిన్నారులు, విదేశీ భక్తులు కూడా ఉత్సాహంగా పాల్గొననున్నారు. రథయాత్ర మార్గమంతా భక్తి గీతాలు, గోవింద నామస్మరణలతో మారుమోగనుంది. జూలై 16 నుంచి 18 వరకు జరిగే ఉత్సవాల్లో భక్తుల కోసం ఇసుక కళల ప్రదర్శన, ఆధ్యాత్మిక గ్రంథాల ప్రదర్శన, చిన్నారుల కోసం ప్రత్యేక కిడ్స్ కార్నర్, భక్తి సంగీత కచేరీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, గీతా ప్రచార కార్యక్రమాలు, మహాప్రసాద పంపిణీ వంటి విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
సమాజంలో సేవా భావాన్ని పెంపొందించే పలు సేవా కార్యక్రమాలను కూడా చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహోత్సవాల ముగింపు సందర్భంగా జూలై 18 సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక ముగింపు సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు విశిష్ట అతిథులు, ప్రజాప్రతినిధులు, ఆధ్యాత్మిక ప్రముఖులు హాజరుకానున్నారు.
భక్తులకు ఉచిత మహాప్రసాదం అందించడంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రలో కుటుంబ సమేతంగా పాల్గొని దివ్య దర్శనం పొందాలని, భక్తి, సేవ, సంస్కృతి కలగలిసిన ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఇస్కాన్ విజయవాడ అధ్యక్షుడు హేమన్ చంద్రకాంత్ దాస్ మహారాజ్ భక్తులకు పిలుపునిచ్చారు.
