ప్రత్యేక ఓటరు జాబితాపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు..

నేటితో ఇంటింటి సర్వే పూర్తి

తిరుపతి, ఆంధ్రప్రభ: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్-2026) కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకటేశ్వర్ సోమవారం రేణిగుంట గ్రామ సచివాలయంతో పాటు మంగళం-2, పోస్టల్ కాలనీ, అవిలాల గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు), బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు)తో సమావేశమై సవరణ కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. అన్ని రాజకీయ పార్టీల బీఎల్‌ఏలు, బీఎల్‌ఓలు సమన్వయంతో పనిచేసి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఓటర్ల జాబితాను రూపొందించాలని ఆదేశించారు.

డోర్ టు డోర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ మంగళవారంతో పూర్తవుతుందని కలెక్టర్ తెలిపారు. గత 30 రోజులుగా బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి, వాటిని సేకరించినట్లు చెప్పారు. సేకరించిన వివరాలను బీఎల్‌ఓ యాప్ ద్వారా డిజిటలైజ్ చేస్తున్నామని, జిల్లాలో ఇప్పటికే 99.5 శాతం డిజిటలైజేషన్ పూర్తైందని వెల్లడించారు. సచివాలయాల్లో ఓటర్లతో నేరుగా మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు.

ప్రత్యేక సవరణలో భాగంగా ఏఎస్‌డీడీ (గైర్హాజరు, మారిపోవడం, మరణించడం, డూప్లికేట్) జాబితాలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, గుర్తించలేని వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు నమోదైన వారి వివరాలను గుర్తిస్తున్నామని చెప్పారు.

అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా తొలగించకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. 2002 ఓటర్ల జాబితాతో లింకేజీ లేని వారి పేర్లను కూడా తొలగించబోమని, జూలై 21న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో వాటిని చేర్చుతామని తెలిపారు. అనంతరం సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేసి, భారత ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించే అవకాశం కల్పిస్తామని చెప్పారు. పత్రాల పరిశీలన అనంతరం తుది ఓటర్ల జాబితాలో పేర్లను ఖరారు చేస్తామని వివరించారు.

జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలనుకునే వారు ఫారం-6 ద్వారా, చిరునామా మార్పు లేదా ఇతర వివరాల సవరణ కోసం ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఉద్యోగ, ఉపాధి తదితర కారణాలతో నివాసం మారిన వారు తమ ప్రస్తుత నివాస ప్రాంతంలో ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. ఒకే కుటుంబ సభ్యులు వేర్వేరు పోలింగ్ స్టేషన్లలో నమోదై ఉంటే వారిని ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఒక వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉండటం చట్టరీత్యా నేరమని, అలాంటి వారు స్వచ్ఛందంగా తమ పరిధిలోని బీఎల్‌ఓను సంప్రదించి ఒక చోట ఓటును తొలగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఎలాంటి తప్పులు, లోపాలు, ద్వంద్వ నమోదులు లేని పారదర్శకమైన, విశ్వసనీయమైన, ఖచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందించడమే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.