వర్షాభావంతో విలవిల్లాడుతున్న పత్తి రైతులు..
ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని పత్తి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సాధారణంగా తొలకరి వర్షాలు కురిసిన వెంటనే రైతులు గట్లు ఏర్పాటు చేసి వాటిపై పత్తి విత్తనాలు నాటుతారు. ఈసారి కూడా అదే విధంగా సాగు చేపట్టినప్పటికీ, ఆ తర్వాత వర్షాలు లేకపోవడంతో పంటకు అవసరమైన తేమ అందక మొక్కలు బలహీనపడుతున్నాయి.
మండలంలోని పలు గ్రామాల్లో పత్తి మొక్కలు ఎదుగుదల కోల్పోయి ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే సాగు కోసం భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులు తిరిగి విత్తనాలు నాటాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. త్వరలో మంచి వర్షాలు కురవకపోతే పత్తి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో సాగు చేసిన పత్తి రకాలు ఎక్కువ కాలపరిమితి కలిగి ఉండటంతో వర్షాలు ఆలస్యమైనా మొక్కలు తట్టుకునేవని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం రైతులు ఎక్కువగా సాగు చేస్తున్న స్వల్ప కాలపరిమితి గల బీటీ పత్తి రకాలు త్వరగా పంట ఇచ్చి రబీ రెండో పంటకు అవకాశం కల్పిస్తున్నప్పటికీ, తేమ లేకపోతే ఈ రకాలు త్వరగా దెబ్బతింటున్నాయని పేర్కొంటున్నారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో పత్తి సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించాలని, అలాగే ప్రభుత్వం వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు తగిన సహాయం అందించాలని రైతులు కోరుతున్నారు.
