ఎల్కతుర్తి మోడల్ స్కూల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
బట్టల వ్యాపారి మృతి.. కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలు
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తారం గ్రామానికి చెందిన పోగుల ప్రసాద్ (54) బట్టల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. హనుమకొండలో బట్టల సరుకును కొనుగోలు చేసి తన టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై ముత్తారం గ్రామానికి తిరిగి వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న టాటా కర్వ్ ఈవీ కారు (నంబర్: TG 03 CH 0531) ఢీకొట్టినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో పోగుల ప్రసాద్ తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
కారును నడుపుతున్న మల్లారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ (50) స్వల్ప గాయాలతో బయటపడగా, చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎల్కతుర్తి ఎస్ఐ నరసింహారావు తెలిపారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.


