Market | సెన్సెక్స్ 47 పాయింట్లు, నిఫ్టీ 4 పాయింట్లు లాభం

Market | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం తీవ్ర ఒడిదొడుకుల మధ్య చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఒత్తిడిని ఎదుర్కొన్న సూచీలు, చివరి గంటలో ఐటీ షేర్లలో నమోదైన కొనుగోళ్లతో కోలుకుని నష్టాల నుంచి బయటపడ్డాయి. ఎఫ్‌ఎంసీజీ, మెటల్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగినప్పటికీ, ఐటీ రంగం మార్కెట్లకు అండగా నిలిచింది.

ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 47.01 పాయింట్లు లాభపడి 77,616.40 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 4.10 పాయింట్లు పెరిగి 24,211 వద్ద స్థిరపడింది. మధ్యాహ్నం వరకు నష్టాల్లో ట్రేడైన సూచీలు చివరి సెషన్‌లో పుంజుకోవడం మార్కెట్ వర్గాల దృష్టిని ఆకర్షించింది.

ఇవాళ‌ ట్రేడింగ్‌లో ఐటీ రంగం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా షేర్లు నిఫ్టీ టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. దీంతో నిఫ్టీ ఐటీ సూచీ ఇతర రంగాల కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచింది. మరోవైపు ఎఫ్‌ఎంసీజీ, మెటల్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీంతో ఆయా రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి.

విస్తృత మార్కెట్‌లో మాత్రం స్వల్ప సానుకూలత కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 0.01 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 0.03 శాతం లాభాలతో ముగిశాయి. చివరి గంటలో కొనుగోళ్ల ఊపు పెరగడంతో మార్కెట్ సానుకూల ముగింపును నమోదు చేసింది.