అయోధ్య ఆలయ ఆరోపణలపై విహెచ్ మౌనదీక్ష
- సీబీఐతో విచారణ జరపాలి
- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
- మౌని దీక్ష శిబిరంలో పాల్గొన్న విహెచ్,స్థానిక ఎమ్మెల్యే వెంకట్రావు
భద్రాచలం, ఆంధ్రప్రభ : అయోధ్య శ్రీరామ మందిరంపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలపై టీపీసీసీ సీనియర్ నాయకులు,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు సోమవారం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ రామచంద్ర మూర్తి సన్నిధిలో మౌన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య శ్రీరామ మందిరానికి సంబంధించ అవినీతి, అవకతవకల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శ్రీరామ మందిర నిర్మాణం కార్యక్రమానికి సంబంధించి వెలువడుతున్న అవినీతి, అవకతపకల ఆరోపణలు కోట్లాది మంది భక్తుల మనోభావాలు, విశ్వాసాలకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశమన్నారు.
అవకతవకలకు బాధ్యలుగా తేలిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పవిత్రమైన శ్రీరాముడి పేరుతో జరిగే కార్యక్రమాల్లో పారదర్శకతతో, భక్తుల విశ్వాసాన్ని పరీక్షించే అంశాలను ఉపేక్షించరాదని తెలిపారు. అయోధ్య రామమందిరానికి సంబంధించిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి నిప్పక్షపాత విచారణకు ఆదేశించాలని కోరారు.ఈ మౌనదీక్షకు సంఘీభావంగా భద్రాచలం ఎమెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, భద్రాద్రి కోత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష్యరాలు తోట దేవి ప్రసన్న, భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్వంచ్ పూనెం కృష్ణ, ఉపసర్వంచ్ రత్నం కవిత, వార్డు సభ్యులు, జిల్లా, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గోన్నారు.
