ప్రతి విద్యార్థి ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం..
మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం: విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, ఆంధ్రప్రభ : ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న బాలికల గురుకుల పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆది శ్రీనివాస్ విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, ఆరోగ్యమే మహాభాగ్యం అని, ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు.
ప్రతి సంవత్సరం రెండు సార్లు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేస్తున్నామని, ఇటీవల పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. అలాగే 14 ఏళ్ల బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) నివారణ కోసం వ్యాక్సిన్ అందిస్తున్నామని చెప్పారు.
ప్రజా ప్రభుత్వంలో గురుకుల పాఠశాలల్లో డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచామని, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందిస్తున్నామని వెల్లడించారు. రానున్న రోజుల్లో వేములవాడ నియోజకవర్గ పరిధిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తరగతులు ప్రారంభం కానున్నాయని తెలిపారు.
హైదరాబాద్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లకు దీటుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్లను ఏర్పాటు చేస్తున్నామని, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను వారి స్వగ్రామాలకే అందించే లక్ష్యంతో ఈ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
విద్యార్థులు తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టాలని, కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, మున్సిపల్ కౌన్సిలర్లు, పాఠశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
