ప్రభుత్వ బడికి సర్పంచ్ బాట.. విద్యార్థుల కోసం ప్రత్యేక వాహనం
‘ప్రైవేట్ పాఠశాలలు వద్దు.. ప్రభుత్వ పాఠశాలే ముద్దు’ నినాదంతో వినూత్న కార్యక్రమం
కాల్వ శ్రీరాంపూర్ (ఆంధ్రప్రభ): ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కాల్వ శ్రీరాంపూర్ మండలం మోట్లపల్లి గ్రామ సర్పంచ్ తుల మనోహర్‌రావు వినూత్న చర్య చేపట్టారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు సులభంగా రాకపోకలు సాగించేలా ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారు. “ప్రైవేట్ పాఠశాలలు వద్దు.. ప్రభుత్వ పాఠశాలే ముద్దు” అనే నినాదంతో ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ తుల మనోహర్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
విద్యార్థుల కోసం ప్రత్యేక వాహనం ఏర్పాటు చేయడాన్ని గ్రామస్థులు, తల్లిదండ్రులు అభినందించారు. తమకు ఈ సౌకర్యం కల్పించిన సర్పంచ్‌కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బొమ్మల సుమలత, మాజీ సర్పంచ్ ముద్దసాని స్వరూప, పంచాయతీ కార్యదర్శి మహేందర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్, వార్డు సభ్యులు రాందేని రాజేశం, పోగుల రమేష్, బెజ్జాల సంపత్, సముద్రాల వసంత, బెజ్జాల మానస, దొమ్మటి శంకరమ్మతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.
