జూన్‌లో రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు 34% పెరుగుదల

జూన్‌లో రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు 34% పెరుగుదల

  • 5.5 బిలియన్ యూరోల విలువైన రష్యా ఇంధన దిగుమతులు
  • రిలయన్స్, ఐఓసీ రిఫైనరీలకు భారీగా ముడి చమురు సరఫరా
  • డిస్కౌంట్ ధరలతో భారత్‌కు రష్యా చమురు ఆకర్షణ
  • రష్యా హైడ్రోకార్బన్ల కొనుగోలులో చైనా తర్వాత భారత్
  • రష్యా చమురుతో తయారైన ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత పాత్ర

న్యూఢిల్లీ : రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు గత నెలతో పోల్చితే జూన్‌లో 34 శాతం పెరిగాయి. జూన్‌లో భారత్ 4.5 బిలియన్ యూరోల విలువైన రష్యా ముడి చమురును కొనుగోలు చేసిందని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) నివేదిక వెల్లడించింది. రష్యా నుంచి మన దేశం దిగుమతి చేసుకున్న మొత్తం 5.5 బిలియన్ యూరోల శిలాజ ఇంధన దిగుమతుల్లో ముడి చమురు వాటా 83 శాతంగా ఉందని పేర్కొంది. చైనా తర్వాత రష్యా హైడ్రోకార్బన్లకు భారత్ అతిపెద్ద కొనుగోలుదారుగా నిలిచిందని నివేదిక పేర్కొంది.

భారత్ మొత్తం ముడి చమురు దిగుమతులు నెలవారీగా 5.4 శాతం పెరగడంతోభారీ పెరుగుదల నమోదైంది. ముఖ్యంగా కీలకమైన రిఫైనరీలకు రష్యా సరఫరాలు గణనీయంగా పెరిగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ జామ్‌నగర్ రిఫైనరీకి సరఫరాలు మే నెలతో పోలిస్తే 150 శాతం పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పారాదీప్ రిఫైనరీకి సరఫరాలు 126 శాతం పెరిగాయి.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌కు చెందిన కొచ్చి రిఫైనరీకి 83 శాతం, నయారా ఎనర్జీ వడినార్ రిఫైనరీకి 45 శాతం ముడి చమురు సరఫరాలు పెరిగాయని సీఆర్ఈఏ తెలిపింది.

భారత్ భారీగా ముడి చమురును దిగుమతి చేసుకోవడంతో జూన్‌లో రష్యా చమురు ఎగుమతులు 1 శాతం పెరిగాయి. అయితే డిస్కౌంట్ ధరలకే రష్యా ముడి చమురును విక్రయిస్తున్నందున ఎగుమతుల ఆదాయం నెలవారీగా 8 శాతం తగ్గి రోజుకు 348 మిలియన్ యూరోలకు పడిపోయింది.

మొత్తంగా ఎగుమతుల పరిమాణంలో 7 శాతం పెరుగుదల నమోదైనప్పటికీ రష్యా శిలాజ ఇంధన ఎగుమతుల ఆదాయం 134 మిలియన్ యూరోలు తగ్గిందని నివేదిక పేర్కొంది. భారత్ దిగుమతి చేసుకున్న 5.5 బిలియన్ యూరోల విలువైన రష్యా హైడ్రోకార్బన్లలో చమురు ఉత్పత్తులు 2.488 బిలియన్ యూరోలు, 444 మిలియన్ యూరోల విలువైన బొగ్గు ఉన్నాయి.

రష్యా చమురుతో తయారైన ఉత్పత్తుల గ్లోబల్ పాత్ర

భారత్‌తో పాటు టర్కీ, బ్రూనై, జార్జియాలోని రిఫైనరీలు రష్యాపై ఆంక్షలు విధించిన యూరోపియన్ యూనియన్ దేశాలకు, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలకు జూన్‌లో 814 మిలియన్ యూరోల విలువైన చమురు ఉత్పత్తులను ఎగుమతి చేశాయి.

ఈ ఎగుమతుల్లో సుమారు 369 మిలియన్ యూరోల విలువైన ఉత్పత్తులు రష్యా ముడి చమురు నుంచి శుద్ధి చేసినవేనని నివేదిక పేర్కొంది. రష్యా ముడి చమురు నుంచి తయారైన చమురు ఉత్పత్తుల దిగుమతులపై యూరోపియన్ యూనియన్ నిషేధం విధించినప్పటికీ, రష్యా క్రూడ్‌ను ఉపయోగించే భారతీయ రిఫైనరీల నుంచి వచ్చిన రెండు ఉత్పత్తులు ఈయూకు ఎగుమతి చేసినట్లు వెల్లడించింది.

శుద్ధి చేసిన డీజిల్, జెట్ ఫ్యూయల్ దిగుమతులను ఈయూ మినహాయించడంతో, రిలయన్స్ జామ్‌నగర్ రిఫైనరీ యునైటెడ్ కింగ్‌డమ్‌కు తొలి జెట్ ఫ్యూయల్ ఎగుమతి చేసింది. జూన్‌లో 63 మిలియన్ యూరోల విలువైన డీజిల్, జెట్ ఫ్యూయల్‌ను రిలయన్స్ యూకేకు ఎగుమతి చేసింది. జామ్‌నగర్ రిఫైనరీ అమెరికాకు కూడా ఇంధన ఉత్పత్తులను ఎగుమతి చేసింది.

జూన్‌లో రష్యా నుంచి 7.3 బిలియన్ యూరోల విలువైన ముడి చమురును చైనా కొనుగోలు చేసింది. దీంతో రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా అగ్రస్థానంలో నిలవగా, భారత్ రెండో స్థానంలో కొనసాగింది.