ఆర్చరీ వరల్డ్‌కప్‌లో భారత సత్తా..

  • కొనసాగుతున్న పతకాల వేట
  • మరో రెండు పతకాలపై గురి…
  • రజతంతో మెరిసిన భారత్..
  • సెమీస్‌కి కీర్తి, పృథికా..

ఆంధ్రప్రభ, అమరావతి : స్పెయిన్‌లోని మాడ్రిడ్ వేదికగా జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-4లో భారత ఆర్చర్స్ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మహిళల కాంపౌండ్ జట్టు రజత పతకాన్ని కైవసం చేసుకోగా, వ్యక్తిగత విభాగాల్లో యువ విలువిద్యాకారిణులు కీర్తి, పృథికా ప్రదీప్ సెమీఫైనల్‌కు చేరి మరో రెండు పతకాలపై ఆశలు సజీవంగా ఉంచారు.

మహిళల కాంపౌండ్ జట్టులో జ్యోతి సురేఖ వెన్నం, పృథికా ప్రదీప్, చికిత తనిపర్తి ఫైనల్లో కొలంబియాతో తలపడి 228-232 తేడాతో ఓడినా రజత పతకాన్ని గెలుచుకుంది. ఈ విజయంపై ఆంధ్రప్రదేశ్ క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జట్టు సభ్యులను అభినందించారు. ప్రపంచ వేదికపై భారత జెండాను రెపరెపలాడించిన క్రీడాకారిణులు యువతకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. సెమీఫైనల్లో దక్షిణ కొరియా వంటి బలమైన జట్టును ఓడించి ఫైనల్‌కు చేరడం విశేషమని పేర్కొన్నారు.

ఇక మహిళల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో 17 ఏళ్ల పృథికా ప్రదీప్ వరుస విజయాలతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫ్రాంజిస్కా గోపెల్, పార్క్ జుంగ్యూన్, లికో అర్రియోలా, ఆండ్రియా మునోజ్‌లను ఓడించి చివరి నలుగురిలో చోటు దక్కించుకుంది. ఇదే టోర్నీలో ప్రపంచ 11వ ర్యాంకర్ టర్కీకి చెందిన హజల్ బురూన్‌ను 145-142 తేడాతో ఓడించి కాంస్య పతకం కూడా సాధించింది.

రికర్వ్ మహిళల వ్యక్తిగత విభాగంలో 19 ఏళ్ల కీర్తి సంచలన ప్రదర్శనతో సెమీఫైనల్‌కు చేరింది. ప్రపంచ, ఒలింపిక్ పతక విజేత మిచెల్ క్రోప్పెన్‌తో పాటు ఒలింపియన్ లై త్సాయ్-చి, ప్రపంచ పతక విజేత ఎలియా కానాలెస్‌లను వరుసగా ఓడించి తన సత్తా చాటింది.

అంతేకాదు, మిక్స్‌డ్ రికర్వ్ జట్టులో కీర్తి-బీ. ధీరజ్ జోడీ కూడా మరో పతకం కోసం పోటీ పడుతోంది. సెమీఫైనల్లో చైనాతో 3-5 తేడాతో ఓడిన భారత జోడీ, ఇప్పుడు కాంస్య పతకం కోసం ఇటలీతో తలపడనుంది.

మహిళల కాంపౌండ్ జట్టు రజతంతో పాటు పృథికా వ్యక్తిగత కాంస్యాన్ని ఇప్పటికే ఖాతాలో వేసుకున్న భారత్.. రికర్వ్ విభాగంలోనూ మరో రెండు పతకాలు సాధించే అవకాశాలను సజీవంగా ఉంచింది.