మడకశిర బ్రాంచ్ కాలువ నిర్మాణానికి భూమిపూజ
జలవనరుల అభివృద్ధికి మరో కీలక అడుగు
శ్రీ సత్యసాయి, (ఆంధ్రప్రభ): శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ప్రాంతంలో సాగునీటి సౌకర్యాలను మరింత మెరుగుపర్చే లక్ష్యంతో చేపట్టనున్న మడకశిర బ్రాంచ్ కాలువ నిర్మాణ పనులకు ఆదివారం ఘనంగా భూమిపూజ నిర్వహించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలువ నిర్మాణం పూర్తయితే మడకశిర నియోజకవర్గ రైతులకు సాగునీటి సమస్యకు గణనీయమైన ఉపశమనం లభిస్తుందని నాయకులు పేర్కొన్నారు.
ప్రభుత్వం వ్యవసాయాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, సాగునీటి వసతుల విస్తరణతో రైతుల ఆదాయం పెరుగుతుందని వారు తెలిపారు. కార్యక్రమంలో అమిలినేని సురేంద్రబాబు, ఎం.ఎస్. రాజు, కందికుంట వెంకట ప్రసాద్, పల్లె రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాలువ నిర్మాణం పూర్తయిన అనంతరం మడకశిర ప్రాంతంలోని పలు గ్రామాలకు సాగునీరు అందుబాటులోకి రావడంతో వ్యవసాయ ఉత్పత్తి పెరగడమే కాకుండా భూగర్భ జలాల మట్టాలు కూడా మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
