వరి సాగు రైతులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి
ఆమనగల్లు (ఆంధ్రప్రభ): వానాకాలం సీజన్‌లో ప్రభుత్వం సూచించిన సన్నరకం వరి విత్తనాలు సాగు చేసే రైతులు తప్పనిసరిగా డీలర్ల వద్ద తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. బుధవారం పట్టణంలోని విత్తన దుకాణంలో ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వం సూచించిన బీపీటీ-5204, ఆర్‌ఎన్‌ఆర్-15048, కేఎన్‌ఎం-1638, కేఎన్‌ఎం-7715, డబ్ల్యూజీఎల్-44, హెచ్‌ఎంటీ సోనా, జైశ్రీరామ్ తదితర ఏడు రకాల సన్నరకం వరి విత్తనాలను సాగు చేసే రైతులు డీలర్ల వద్ద కొనుగోలు చేయాలని తెలిపారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు, విత్తనాల కొనుగోలు బిల్లు సమర్పించి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకుంటే ప్రభుత్వం ప్రకటించిన ఎకరాకు రూ.500 బోనస్ పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
