మద్యం మత్తులో హత్య..

  • రెండు నెలల తర్వాత ఛేదించిన పోలీసులు..
  • స్నేహితుడి అప్పు వివాదమే ప్రాణాలు తీసింది..
  • రాయి బండతో తలపై మోది హత్య..
  • ఇద్దరు నిందితుల అరెస్టు..
  • డీఎన్‌ఏ పరీక్ష కోసం పుర్రె స్వాధీనం..
  • మిస్టరీ వీడిన కేసు..

కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ : దాదాపు రెండు నెలలుగా అదృశ్యమైన వ్యక్తి కేసును కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు ఛేదించారు. అదృశ్యమైనట్లు భావించిన వ్యక్తిని స్నేహితులే దారుణంగా హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

మంగళవారం రాత్రి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్లూరు ఎస్టేట్ చింతలముని నగర్‌కు చెందిన కొండపల్లి శ్రీనివాసులు ఈ ఏడాది మే 13 నుంచి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు మొదట ఆయన తిరిగి వస్తాడని భావించి వేచి చూశారు. అయితే నెలకుపైగా గడిచినా ఆచూకీ లభించకపోవడంతో జూన్ 20న కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కాల్ డేటాతో వెలుగులోకి హత్య…

దర్యాప్తులో భాగంగా పోలీసులు శ్రీనివాసుల కాల్ డేటాను విశ్లేషించారు. విచారణలో అదే ప్రాంతానికి చెందిన మేస్త్రీ మౌలాలితో శ్రీనివాసులకు సన్నిహిత పరిచయం ఉన్నట్లు గుర్తించారు. గతంలో మౌలాలి కొంత నగదు శ్రీనివాసులకు అప్పుగా ఇచ్చాడు. ఏడాది క్రితం ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని అడగడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ వివాదం నేపథ్యంలో శ్రీనివాసులు తన స్నేహితులతో కలిసి గతంలో రెండుసార్లు మౌలాలిపై దాడి చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. దీంతో తనపై మళ్లీ దాడి జరిగే అవకాశం ఉందని భావించిన మౌలాలి, శ్రీనివాసులను అంతమొందించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

పక్కా పథకంతో హత్య..

తనతో కలిసి సెంట్రింగ్ పనులు చేసే యువరాజ్ అలియాస్ అభిని మౌలాలి తన కుట్రలో భాగస్వామిని చేశాడు. మే 13 రాత్రి శ్రీనివాసులకు ఫోన్ చేసి సంతోష్‌నగర్ నుంచి తీసుకెళ్లారు. అనంతరం చిన్నమ్మ సర్కిల్ వద్ద మద్యం కొనుగోలు చేసి, కల్లూరు ఎస్టేట్ సమీపంలోని శ్రీ గోడ ఆంజనేయస్వామి ఆలయ శివారు ప్రాంతంలోని వెంచర్ వద్దకు వెళ్లారు. అక్కడ ముగ్గురు కలిసి మద్యం సేవించిన అనంతరం, ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఇద్దరు కలిసి శ్రీనివాసులపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టిన అనంతరం భారీ రాయితో తలపై మోది హత్య చేసి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

డ్రోన్, డాగ్ స్క్వాడ్‌తో గాలింపు..

ఫిర్యాదు ఆలస్యంగా రావడంతో కేసు దర్యాప్తు క్లిష్టంగా మారిందని పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాలు, స్థానిక యువకుల సహకారంతో శివారు ప్రాంతంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ మొదట్లో ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే నేరస్థలం సమీపంలో ఒక మానవ పుర్రె లభించడంతో దానిని స్వాధీనం చేసుకున్నారు. అది కొండపల్లి శ్రీనివాసులదేనా అనే విషయాన్ని నిర్ధారించేందుకు డీఎన్‌ఏ పరీక్షల కోసం ఫోరెన్సిక్ నిపుణులకు పంపినట్లు పోలీసులు తెలిపారు.

ఇద్దరు నిందితులు రిమాండ్‌కు..

సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా విశ్లేషణ, విచారణలో లభించిన సమాచారంతో మౌలాలి, యువరాజ్ అలియాస్ అభిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు. పూర్తి డీఎన్‌ఏ నివేదిక వచ్చిన తర్వాత కేసులో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.