అయోధ్య కానుకల చోరీపై సీబీఐ విచారణ చేపట్టాలి
-సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
తొర్రూరు, ఆంధ్రప్రభ: అయోధ్య రామ మందిరం కానుకల చోరీపై వెంటనే సీబీఐ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రామ మందిరం కానుకల చోరీపై సీబీఐ విచారణ జరుపాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అయోధ్య రామ మందిరంలో పెద్ద ఎత్తున రామ భక్తుల కానుకల చోరీ జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, కుంభకోణం బయట పడినా నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నదని అన్నారు.దేవాలయములో దోపిడీకి బీజేపీ బాధ్యత వహించాలన్నారు. హిందూత్వం పేరు చెప్పి ఆలయ సంపద దోపిడీ చేశారని, బీజేపీ నాయకులు దీనిపై సమాధానము చెప్పాలని డిమాండ్ చేశారు.భక్తి ముసుగులో బీజేపీ నాయకుల గుడి దోపిడీ చూస్తే భక్తుల గుండె తరుక్కుపోతుందని, దేవాలయాలకి బీజేపీ తీరని అన్యాయం చేస్తున్నదని అన్నారు.
గుడిలో ఉన్న దేవుడికి కూడా రక్షణ లేదని, బీజేపీ దోపిడీ చూసి దేవుడు కూడా వణికిపోతున్నాడని అన్నారు.హిందుత్వం పేరుతో రాజకీయం చేస్తున్న బీజేపీ చేతిలో దేవాలయాలు చిన్నాభిన్నం అవుతున్నాయని,ఆలయాల పవిత్రతకు భంగం కలుగుతున్నదని,బీజేపీ తీరుతో భక్తుల గుండెల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నదని అన్నారు. దేవుడి సొమ్ము దేవుడికే దక్కాలని,బీజేపీ దోపిడీని అడ్డుకుని ఆలయాలను కాపాడుకోవాలన్నారు. దేవాలయాల సంపదను దోచుకుంటున్న బీజేపీతో హిందూ ధర్మానికి పెద్ద ప్రమాదం ఏర్పడిందని, గుడిలో దోపిడీతో ఆ పవిత్రతకు భంగం కలిగిందన్నారు.
రామ మందిరం విషయంలో బీజేపీ తీరుతో భక్తుల విశ్వాసం దెబ్బతిన్నదని అన్నారు. దేవుడి ఆస్తి దేవుడికే చెందాలని, బీజేపీ దోపిడీని సహించరాదని, బీజేపీ నాయకులు చేసిన ఆలయ దోపిడీని ఖండిస్తున్నామని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బి. విజయ సారథి, సిపిఐ మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తమ్మెర విశ్వేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి. అజయ్ సారధి రెడ్డి, సుధాకర్ రెడ్డి,కట్టెబోయిన శ్రీనివాస్,సిపిఐ నాయకులు ఓమ బిక్షపతి, బందు మహేందర్, కిరణ్, లక్ష్మణ్, పెరుగు కుమార్, రేశ పల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి, కట్లోజు పాండురంగ చారి, వరిపల్లి వెంకన్న, నెల్లూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
