నిబంధనలు ఉల్లంఘిస్తున్న బీఈడీ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి

రాయలసీమ యూనివర్సిటీ అధికారుల అండతోనే అక్రమాలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాల ఆరోపణ

నందికొట్కూరు, ఆంధ్రప్రభ : యూనివర్సిటీ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్వహిస్తున్న బీఈడీ కళాశాలల అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నందికొట్కూరులో ఏఐఎస్‌ఎఫ్, ఏవీఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం సంయుక్తంగా ధర్నా నిర్వహించారు.

సాయి బీఈడీ కళాశాల ఎదుట చేపట్టిన ఆందోళనలో విద్యార్థి సంఘాల జిల్లా నాయకులు పాల్గొని మాట్లాడారు. బీఈడీ విద్యార్థుల భవిష్యత్తుతో కళాశాల యాజమాన్యాలు చెలగాటమాడుతున్నాయని వారు ఆరోపించారు.

ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా నాయకుడు డక్క కుమార్, ఆంధ్ర విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ, ఎన్‌సీటీఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ రాయలసీమ యూనివర్సిటీ అధికారుల అండతో కొన్ని కళాశాలలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.

విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ, కంప్యూటర్ ల్యాబ్‌లు, అవసరమైన బోధనా సిబ్బంది లేకుండానే కళాశాలలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ముఖ హాజరు (ఫేస్ అటెండెన్స్) నమోదు చేయకుండానే తరగతులు నిర్వహిస్తున్నారని పేర్కొంటూ, రాయలసీమ యూనివర్సిటీ అధికారులు వెంటనే స్పందించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.