అమెరికాలో రోడ్డు ప్రమాదం..
- మూలపాడులో విషాదం
- న్యూయార్క్ లో సిగ్నల్ వద్ద కారును ఢీకొన్న మరో వాహనం
- అక్కడికక్కడే మృతి చెందిన మూలపాడు యువతి
ఇబ్రహీంపట్నం, (ఎన్టీఆర్) ఆంధ్రప్రభ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో విషాదం నింపింది. గ్రామానికి చెందిన యువతి అట్లూరి ప్రసన్న లక్ష్మి (30) ప్రాణాలు కోల్పోయింది. సేకరించిన సమాచారం, బంధువుల కథనం మేరకు మూలపాడుకు చెందిన అట్లూరి వసంతరావు, మల్లీశ్వరి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. రెండేళ్ల క్రితం కుమార్తె ప్రసన్న లక్ష్మి అమెరికా వెళ్లి ఫైనల్ లో ఎంఎస్ పూర్తి చేసింది. న్యూ జెర్సీ నగరంలో ఉంటున్న ఆమె నాలుగు రోజుల క్రితమే అక్కడ ఉద్యోగానికి ఎంపికైంది.
ఈ నేపథ్యంలోనే ఈ నెల 5న స్నేహితులతో కలిసి దేవుడిని దర్శించుకునేందుకు కారులో దేవాలయానికి బయలుదేరింది. న్యూయార్క్ నగరంలో సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వీరి కారును వెనుక నుంచి మరో వాహనం బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రసన్న లక్ష్మితో పాటు మరో యువతి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలవ్వగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో మూలపాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రసన్న లక్ష్మి గ్రామానికి చెందిన తెలుగు యువత జిల్లా నాయకుడు గరికపాటి శివకు పీఏసీఎస్ అధ్యక్షుడు గరికపాటి శ్రీనివాసరావుకు మేనకోడలు. ఆమె భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. శనివారం స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉందని బంధువులు చెబుతున్నారు.
