ఒడిస్సీ నృత్య ప్రదర్శనతో అలరించిన కళాకారిణి

దిలావర్‌పూర్, ఆంధ్రప్రభ: దిలావర్‌పూర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో మంగళవారం ఒడిస్సీ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. భారతీయ శాస్త్రీయ నృత్య, సంగీత సంప్రదాయాల ప్రచారం కోసం ఢిల్లీ ఐఐటీ మాజీ ఆచార్యులు పద్మశ్రీ డా. కిరణ్ సేన్ స్థాపించిన సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ కల్చర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రముఖ ఒడిస్సీ నృత్య కళాకారిణి అశా కుమారి తన అద్భుత నృత్య ప్రదర్శనతో విద్యార్థులు, ఉపాధ్యాయులను అలరించారు. ప్రదర్శనతో పాటు దేశంలోని వివిధ శాస్త్రీయ, సాంప్రదాయ నృత్యాల విశిష్టతను వివరించారు. భరతనాట్యం, కథకళి, ఒడిస్సీ వంటి నృత్యాల్లోని భంగిమలు, ముద్రలు, ప్రత్యేకతలను విద్యార్థులకు వివరించి అవగాహన కల్పించారు. ఒడిస్సీ నృత్యంలోని అర్ధచతురస్ర, దీర్ఘచతురస్ర భంగిమలు, వివిధ హస్తముద్రల గురించి వివరించారు. ఆసక్తి కనబరిచిన విద్యార్థులతో ఒడిస్సీ నృత్యంలోని ప్రాథమిక భంగిమలను అభ్యసింపజేశారు. నృత్య కళల ప్రాముఖ్యత, ఆరోగ్యపరమైన, సాంస్కృతిక ప్రయోజనాలను వివరించగా, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దిలావర్‌పూర్ మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. సదానందం మాట్లాడుతూ, భారతీయ సాంప్రదాయ నృత్యాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం, వాటిని అభ్యసించే అవకాశం ప్రభుత్వ ఆధ్వర్యంలో తమ పాఠశాల విద్యార్థులకు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తూ విద్యార్థుల్లో భారతీయ శాస్త్రీయ కళల పట్ల ఆసక్తిని పెంపొందించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.