వేలాడుతున్న విద్యుత్ తీగ.. ఆవు, పెంపుడు కుక్క మృతి
ఎల్కతుర్తి,ఆంధ్రప్రభ: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామం కొత్తపల్లి శివారులో వేలాడుతున్న విద్యుత్ తీగ తెగిపడటంతో రైతు పాడి ఆవు, పెంపుడు కుక్క మృతి చెందగా, రైతు కుమారుడు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
బాధిత రైతు మంతుర్తి మొగిలి తండ్రి కొమురయ్య కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమి సర్వే నంబర్ 524లో ఉంది. ఈ భూమిపై నుంచి చాలా కాలంగా విద్యుత్ తీగలు కిందికి వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయని రైతు ఆరోపించారు. పలుమార్లు తీగలు తెగినా కొత్త తీగలు వేయకుండా తాత్కాలికంగా మరమ్మతులు చేసి వదిలేస్తున్నారని తెలిపారు.
మంగళవారం అకస్మాత్తుగా విద్యుత్ తీగ తెగి నేలపై పడటంతో మేతకు వెళ్లిన పాడి ఆవు కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. రోజుకు సుమారు 10 లీటర్ల పాలు ఇస్తూ కుటుంబానికి జీవనాధారంగా ఉన్న ఆవు మృతి చెందడంతో రైతు కుటుంబం తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూసింది.
అదే సమయంలో అక్కడ కాపలా కాస్తున్న పెంపుడు కుక్క కూడా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది. ఆవు లేవకపోవడంతో దాని వద్దకు వెళ్లిన రైతు కుమారుడు చింటూకు కూడా విద్యుత్ షాక్ తగిలింది. అయితే అదృష్టవశాత్తూ అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా అమాయక జంతువులు ప్రాణాలు కోల్పోతున్నాయని రైతులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ, ట్రాన్స్‌కో అధికారులు వెంటనే స్పందించి పాత, ప్రమాదకర విద్యుత్ తీగలను తొలగించి కొత్త తీగలు ఏర్పాటు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మృతి చెందిన పాడి ఆవుకు తగిన నష్టపరిహారం మంజూరు చేసి బాధిత రైతు కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
