ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

ఉద్యోగుల వినతులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం
ఏపీ ఎన్‌జీజీవో నాయకులతో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

విజయవాడ, ఆంధ్రప్రభ : ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషిచేస్తాన‌ని.. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రస్తావించిన అంశాలను సానుకూల దృక్పథంతో పరిశీలించి ప్ర‌భుత్వానికి నివేదించ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లకు సంబంధించిన పలు సమస్యలు, డిమాండ్లపై ఏపీ జే ఏ సి జిల్లా అధ్యక్షుడు డి.సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు జే ఏ సి నాయకులు మంగళవారం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశను క‌లెక్ట‌రేట్‌లో కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా జే ఏ సి జిల్లా అధ్యక్షుడు డి.సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) నియామకం, మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించడం, హెల్త్ కార్డుల అమలు, సరెండర్ లీవ్, డీఏ, పీఆర్సీ బకాయిల విడుదల, సీపీఎస్‌కు బదులుగా ఓపీఎస్ అమలు, స్వ‌ర్ణ గ్రామం, స్వ‌ర్ణ వార్డు ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, పెన్షనర్ల బకాయిల చెల్లింపు, అదనపు క్వాంటం పెన్షన్ పునరుద్ధరణ తదితర అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కొంత మేరకు సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని ఉద్యోగులకు సంబంధించి 27 వేల కోట్ల బకాయిలు చెల్లిచడం జరిగిందని మెమో-57 ప్రకారం 2004కు ముందు నోటిఫికేషన్ పొందిన పోస్టులపై నియమితులైన సుమారు 11 వేల మంది ఉద్యోగులకు సీపీఎస్ స్థానంలో ఓపీఎస్ అమలు , ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల విద్యాసంస్థలు, సొసైటీలలో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచడం ఉద్యోగులకు ఎంతో మేలు చేసిన నిర్ణయమని పేర్కొన్నారు.

ఉద్యోగుల ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతూ తమ వినతులను వివరించారు. వినతిపత్రాన్ని స్వీకరించిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించి తన పరిధి లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రస్తావించిన అంశాలను పరిశీలించి సంబంధిత ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు, విధానాలకు అనుగుణంగా వినతులను పరిశీలనకు పంపిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల అమలు ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించేందుకు కలసి కృషి చేద్దామని అన్నారు.

కలెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌ను క‌లిసిన వారిలో జిల్లా జేఏసీ ఛైర్మ‌న్ డి.సత్యనారాయణరెడ్డి, సెక్రటరీ సయ్యద్ ఖాసిం, కో చైర్మన్ పి.రమేష్, వైస్ చైర్మన్ జి.నారాయణరావు, స్టేట్ సెక్రటరీ ఎం.డి.జానీపాషా, ఆర్గనైజింగ్ సెక్రెటరీ జి.రామకృష్ణ, కోశాధికారి బి.సతీష్ కుమార్, జాయింట్ సెక్రెటరీ సుందరయ్య, విష్ణువర్ధన్ రావు, క్షమా బేగం, ఎన్టీఆర్ జిల్లా సహాధ్య‌క్షులు వీవీ ప్ర‌సాద్‌, న‌గర శాఖ కో-చైర్మన్ ఎస్‌కే నజురుద్దీన్, డిఎస్ఎన్ శ్రీనివాస్, కాశీం సాహెబ్, కె.శివ శంకర్, సిహెచ్ శ్రీదేవి, బీవీ.రమణ, వి.సాయిరాం, బాబురావు త‌దిత‌రులు పాల్గొన్నారు.