జీసీసీకి పూర్వవైభవం తీసుకురావాలి
- మౌలిక వసతుల కల్పనకు సహకరించాలి
- ఐటీడీఏ పీఓను కోరిన జీసీసీ రాష్ట్ర చైర్మన్ కోట్నాక్ తిరుపతి
ఉట్నూర్, ఆంధ్రప్రభ: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) మౌలిక వసతులను మెరుగుపరిచి, సంస్థకు పూర్వవైభవం తీసుకురావడానికి అవసరమైన సహకారం అందించాలని జీసీసీ రాష్ట్ర చైర్మన్ కోట్నాక్ తిరుపతి కోరారు.
మంగళవారం ఉట్నూర్ ఐటిడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరంద్‌ను ఆయన చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం జీసీసీ అభివృద్ధిపై పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా కోట్నాక్ తిరుపతి మాట్లాడుతూ, గిరిజన సహకార సంస్థ పరిధిలోని డీఆర్ డిపోలను ఆధునికీకరించేందుకు అవసరమైన నిధులను ఐటిడీఏ ద్వారా సమకూర్చాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రాజెక్టు అధికారి, అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జీసీసీ డివిజనల్ మేనేజర్ గుడిమళ్ల సందీప్ కుమార్‌ను ఆదేశించారు. ప్రతిపాదనలు అందిన వెంటనే ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు.
అనంతరం కోట్నాక్ తిరుపతి ఉట్నూర్ జీసీసీ డివిజనల్ కార్యాలయాన్ని సందర్శించి అధికారులతో సమావేశమయ్యారు. డివిజన్ పరిధిలో జీసీసీ ద్వారా అమలవుతున్న వివిధ కార్యక్రమాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. డివిజనల్ కార్యాలయ నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరు కోసం కృషి చేస్తానని చైర్మన్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జీసీసీ డివిజనల్ మేనేజర్ జి. సందీప్ కుమార్, జూనియర్ మేనేజర్ గులాబ్ సింగ్, ఉద్యోగులు లింబారావు, సత్యనారాయణ, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
