‘సముద్రం మనల్ని విడదీయలేదు’.. మోదీ ప్రసంగం !

  • ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపు…
  • ఇండోనేషియా పార్లమెంట్‌లో మోదీ చారిత్రాత్మక ప్రసంగం..
  • భారత్–ఇండోనేషియా మధ్య భారీ ఒప్పందాలు
  • ఇండోనేషియాలో మోదీకి అత్యున్నత పౌర పురస్కారం..
  • రక్షణ, విద్య, సాంకేతిక రంగాల్లో భారత్–ఇండోనేషియా చారిత్రాత్మక భాగస్వామ్యం
  • బ్రహ్మోస్, ఐఐఎంబీ సహా 20 కీలక ఒప్పందాలు!

ఆంధ్ర‌ప్ర‌భ : ఇండోనేషియా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రెండో రోజు చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం ఇండోనేషియా పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత్, ఇండోనేషియాలు కేవలం పొరుగు దేశాలు మాత్రమే కావని, ఉమ్మడి చరిత్ర, సంస్కృతి, ప్రజాస్వామ్య విలువలతో ముడిపడిన ‘నాగరికత భాగస్వాములు’ (Civilisational Partners) అని అభివర్ణించారు. 140 కోట్ల మంది భారతీయులు, 29 కోట్ల మంది ఇండోనేషియా ప్రజలు కలిసి నడిస్తే ప్రపంచం ఒక సరికొత్త చరిత్రను వీక్షిస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

సముద్రం మనల్ని వేరు చేయలేదు..

పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఇరు దేశాల మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక బంధాన్ని గుర్తుచేశారు. “మన సంబంధాలు రామాయణ, మహాభారతాల వారసత్వంలో, నలందా విశ్వవిద్యాలయ జ్ఞానంలో దాగి ఉన్నాయి. బోరోబుదూర్, ప్రంబనన్ వంటి అద్భుతమైన కట్టడాలు మనల్ని ఎప్పటికీ కలుపుతూనే ఉంటాయి. భౌగోళికంగా మన రాజధానులు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ.. సముద్ర తీరం పరంగా కేవలం 150 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాం. చాలా దేశాలకు సముద్రం ఒక సరిహద్దు కావచ్చు, కానీ భారత్-ఇండోనేషియాల మధ్య సముద్రం ఎప్పుడూ దూరాన్ని సూచించలేదు. అది మనల్ని కలిపే ఒక వంతెన” అని మోదీ వ్యాఖ్యానించారు. భారత్‌ ఎప్పుడూ విస్తరణవాదాన్ని నమ్మదని, కేవలం అభివృద్ధి పంథాలోనే పయనిస్తుందని.. ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ (అందరి మద్దతుతో అందరి అభివృద్ధి) అనే మంత్రంతోనే తాను ఇక్కడికి వచ్చానని స్పష్టం చేశారు.

ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం ‘బింతాంగ్ ఆదిపూర్ణ’

ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఇండోనేషియా ప్రభుత్వం తమ దేశపు అత్యున్నత పౌర పురస్కారం ‘బింతాంగ్ ఆదిపూర్ణ’ (Bintang Adipurna) ను అందించి గౌరవించింది. ఈ పురస్కారాన్ని అత్యంత వినమ్రతతో స్వీకరిస్తున్నట్లు తెలిపిన మోదీ.. “ఈ గౌరవం కోట్లాది మంది భారతీయులకు, ఇరు దేశాల ప్రజాస్వామ్య విలువలకు మరియు ఉమ్మడి వారసత్వానికి దక్కిన గౌరవం” అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అధ్యక్షుడు ప్రబోవోకు కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం తనకు లభించిన ఘన స్వాగతాన్ని ప్రస్తావిస్తూ.. “ఈ ప్రేమ, గౌరవాలపై ఎవరికీ కాపీరైట్ లేదు” అని చమత్కరించారు.

రక్షణ, విద్య, సాంకేతికత రంగాల్లో 20 చారిత్రాత్మక ఒప్పందాలు…

ప్రధాని మోదీ, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోల మధ్య జరిగిన ప్రతినిధుల స్థాయి చర్చల అనంతరం ఇరు దేశాలు వివిధ రంగాలలో ఏకంగా 20 చారిత్రాత్మక ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నాయి. వ్యూహాత్మక ‘బ్రహ్మోస్’ (BrahMos) మిసైల్ సిస్టమ్, ఎయిర్-టు-ఎయిర్ మిసైల్ టెక్నాలజీపై కీలక రక్షణ ఒప్పందాలు జరిగాయి. ఇండోనేషియాలోని ‘సింఘసారీ ఎస్‌ఈజెడ్’ (Singhasari SEZ) లో ప్రముఖ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు (IIM Bangalore) అంతర్జాతీయ బ్రాంచ్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నారు. మైనింగ్, క్రిటికల్ మినరల్స్, అగ్రికల్చర్, టెలికమ్యూనికేషన్స్, హెల్త్‌కేర్, స్పేస్ కోఆపరేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ , డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI) లలో పరస్పర సహకారం.

ఈ పర్యటన ఫలితాలు ఎంతో విస్తృతమైనవి, స్పష్టమైనవి మరియు భవిష్యత్తుకు దిక్సూచి లాంటివని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల మైత్రి రాబోయే కాలంలో మరిన్ని సరికొత్త శిఖరాలను అధిరోహిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇండోనేషియా పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ తన తదుపరి పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాకు బయలుదేరనున్నారు.