Satluj Movie | ‘సట్లుజ్’ చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్‌ ట్వీట్‌

Satluj Movie | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: వివాదాస్పద అంశాన్ని ప్రధానంగా తీసుకుని తెరకెక్కిన ‘సట్లుజ్’ చిత్రం విడుదలకు ముందే దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. తాజాగా ఈ సినిమాను వీక్షించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన X ఖాతాలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ సినిమా కేవలం వినోదం కోసం రూపొందించిన చిత్రం కాదని, చరిత్రలోని అత్యంత విషాదకరమైన సంఘటనలను ప్రేక్షకుల ముందుంచే ధైర్యవంతమైన సినీ ప్రయత్నమని వర్మ పేర్కొన్నారు. సినిమా ముగిసిన తర్వాత కూడా దాని ప్రభావం ప్రేక్షకుల మనసులో చాలా కాలం నిలిచిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

దర్శకుడు హనీ ట్రిఫన్‌ హనీ త్రెహాన్ కథను చెప్పిన విధానం కూడా ప్రశంసనీయమని వర్మ అన్నారు. సంచలన దృశ్యాలపై ఆధారపడకుండా, అధికారిక పత్రాలు, దర్యాప్తు ప్రక్రియ, నిశ్శబ్ద సంభాషణల ద్వారా కథను ముందుకు తీసుకెళ్లడం వల్ల సినిమా మరింత ప్రభావవంతంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రజాస్వామ్యంలో నిజం, న్యాయం, బాధ్యత వంటి అంశాలపై ఈ చిత్రం ఆలోచింపజేస్తుందని వర్మ వ్యాఖ్యానించారు. ఎలాంటి బోధనా ధోరణి లేకుండా ప్రశ్నలను మాత్రమే ప్రేక్షకుల ముందుంచడం ఈ చిత్రానికి ఉన్న ప్రత్యేకత అని తెలిపారు. సినిమా ప్రదర్శన, విడుదల చుట్టూ నెలకొన్న వివాదాలను ప్రస్తావించిన ఆయన.. అధికారంలో ఉన్నవారిని అసౌకర్యానికి గురిచేసే కళే నిజమైన కళ అని పేర్కొన్నారు. సమాజంలో చర్చకు దారితీసే చిత్రాలు మరింత మందికి చేరాల్సిన అవసరం ఉందన్నారు.

అలాగే, మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ కాల్‌రా కు జరిగిన అన్యాయం మాదిరిగా ఈ చిత్రానికీ జరగకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. చివరగా, “నిజాన్ని దాచాలని ఎంత ప్రయత్నించినా, అది అంతకంతకూ మరింత బలంగా బయటపడుతుంది” అంటూ తన పోస్టును ముగించారు.