సివిల్స్ లక్ష్యంగా యువతకు సువర్ణావకాశం

  • 10 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ: సివిల్ సర్వీసుల్లో రాణించాలని లక్ష్యంగా పెట్టుకున్న నిరుపేద విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్ మంచి అవకాశాన్ని అందిస్తోంది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్, మెయిన్స్) కోసం 10 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ శిక్షణకు సంబంధించిన కరపత్రాలను జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్ ఐఏఎస్, హరిప్రియతో పాటు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి డి.సునీత ఆవిష్కరించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన డిగ్రీ అర్హత కలిగి, వార్షిక కుటుంబ ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

అభ్యర్థులు జూలై 12లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ శిక్షణకు సంబంధించి అర్హత పరీక్ష జూలై 19న హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా స్టడీ సర్కిల్ డైరెక్టర్ కాడం శ్రీనివాస్ వెల్లడించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా సూచించారు.