ఈ నెల 7న సర్ మెగా డ్రైవ్..!

  • ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌పై ప్రత్యేక దృష్టి
  • ఓటర్ల హెల్ప్ డెస్క్‌ల సద్వినియోగానికి విస్తృత అవగాహన
  • క్షేత్రస్థాయిలో వేగవంతమైన చర్యలకు అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
  • ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, ప్రత్యేక అధికారులతో కలెక్టర్ డా. జి. లక్ష్మీశ టెలీకాన్ఫరెన్స్

విజయవాడ, ఆంధ్రప్రభ: ఓటర్ల జాబితా సమగ్ర సర్వే (ఎస్‌ఐఆర్) ప్రక్రియను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా పూర్తిచేసేందుకు ఈ నెల 7వ తేదీన జిల్లావ్యాప్తంగా ప్రత్యేక మెగా డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, ప్రత్యేక అధికారులు, సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు.

మెగా డ్రైవ్ సందర్భంగా క్షేత్రస్థాయిలో అందిన ఎన్యూమరేషన్ ఫారాలను ఎలాంటి జాప్యం లేకుండా డిజిటైజ్ చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఫారాల స్వీకరణ, నమోదు, డిజిటైజేషన్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు పురోగతిని నమోదు చేయాలని సూచించారు. ఓటర్లకు అందుబాటులో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ల సేవలను విస్తృతంగా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.

ఫారాలు నింపి బీఎల్‌వోల‌కు అందించ‌డంలో ఓటర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని చెప్పారు. ప్రత్యేక అధికారులు, ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, బీఎల్‌వోలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషిచేయాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు. టెలీకాన్ఫరెన్స్‌లో జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ త‌దిత‌రులు పాల్గొన్నారు.