మైనర్ పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవు
ఎస్‌ఐ ఇందిర
అచ్చంపేట, ఆంధ్రప్రభ: మైనర్ బాల,బాలికలను పనిలో పెట్టుకుంటే సంబంధిత యజమానులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ముస్కాన్-12 అచ్చంపేట సబ్-డివిజన్ ఇన్‌చార్జి ఎస్.ఐ. ఇందిర హెచ్చరించారు. అచ్చంపేట మండల పరిధిలోని హాజీపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇటుక తయారీ కేంద్రాలను ముస్కాన్ బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది.
తనిఖీల సందర్భంగా ఇద్దరు మైనర్ బాలురు ఇటుక తయారీ పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు గుర్తించిన అధికారులు వారిని రక్షించి, బాలల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ ఇందిర మాట్లాడుతూ.. 14 ఏళ్లలోపు పిల్లలను ఏ విధమైన పనుల్లోనైనా నియమించడం చట్టవిరుద్ధమని, అలాగే బాల కార్మిక చట్టాలను ఉల్లంఘించే యజమానులపై కేసులు నమోదు చేసి, అవసరమైతే జైలుకు పంపించే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పిల్లల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తు దృష్ట్యా బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు. ఈ తనిఖీల్లో ముస్కాన్ టీం సభ్యులు మహేష్, రాము, సరిత, శివలీల, సీడబ్ల్యూసీ సభ్యులు మల్లేష్, జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
