మొలకెత్తని విత్తనాలు.. చెట్టెక్కి రైతు వినూత్న నిరసన
బైంసా, ఆంధ్రప్రభ: బైంసా వ్యవసాయ మార్కెట్ ఆవరణలో సోమవారం చోండి గ్రామానికి చెందిన రైతు రాజలింగం వేప చెట్టు ఎక్కి వినూత్న నిరసన చేపట్టాడు. మార్కెట్లోని ఓ ఎరువులు, విత్తనాల దుకాణంలో కొనుగోలు చేసిన తొమ్మిది బస్తాల తేజస్వి సోనమ్ సోయా విత్తనాలు మొలకెత్తలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ విషయమై షాపు యాజమాన్యాన్ని ప్రశ్నించగా బాధ్యతారాహిత్యంగా సమాధానం చెప్పడంతో మనస్తాపానికి గురైన రైతు చెట్టెక్కి నిరసన వ్యక్తం చేశాడు. ఆయనకు మద్దతుగా పలు గ్రామాలకు చెందిన రైతులు దుకాణం ముందు ఆందోళన చేపట్టారు.
వ్యవసాయాధికారులు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేసే వరకు చెట్టు దిగేది లేదని రైతు స్పష్టం చేశాడు. అనంతరం అధికారులు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతు చెట్టు దిగాడు.
