వార్డు సభ్యుల శిక్షణకు నామమాత్ర హాజరు..

మరిపెడ, ఆంధ్రప్రభ: పంచాయతీ వార్డు సభ్యులకు పరిపాలన, గ్రామాభివృద్ధి, ప్రభుత్వ పథకాలు, పంచాయతీ విధులు, నిధుల వినియోగంపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి వార్డు సభ్యుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల వారీగా ఎంపిక చేసిన వార్డు సభ్యులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల పరిధిలోని గిరిపురం రైతు వేదికలో జరుగుతున్న ఐదు రోజుల శిక్షణలో భాగంగా మూడో విడత తరగతులు నిర్వహించారు.

ఈ విడతలో 11 గ్రామాలకు చెందిన 140 మంది వార్డు సభ్యులు హాజరు కావాల్సి ఉండగా, కేవలం 20 నుంచి 30 మంది మాత్రమే హాజరైనట్లు సమాచారం. దీంతో శిక్షణ కార్యక్రమం నామమాత్రంగా సాగింది.

పంచాయతీ పాలనకు సంబంధించిన కీలక అంశాలపై అవగాహన కల్పించే ఈ శిక్షణకు ఐదు రోజుల సమయం కేటాయించని వార్డు సభ్యులు, ఐదేళ్లపాటు ప్రజా సమస్యల పరిష్కారంలో ఎంత నిబద్ధతతో పనిచేస్తారనే ప్రశ్నలు గ్రామస్థుల నుంచి వ్యక్తమవుతున్నాయి.