అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలి: సీపీఐ(ఎంఎల్) డిమాండ్

టేకుమట్ల, ఆంధ్రప్రభ : మండలంలోని కలికోట గ్రామపంచాయతీ పరిధిలోని మానేరు వాగు, చలివాగు ప్రవాహ ప్రాంతాలైన వెలిశాల, బుర్నపల్లి, ఆసిరెడ్డిపల్లి, రాఘవరెడ్డిపేట గ్రామాల పరిసరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని సీపీఐ(ఎంఎల్) జయశంకర్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ ఆరోపించారు.

సోమవారం ఆయన మాట్లాడుతూ, సంబంధిత ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే అక్రమ ఇసుక దందాకు కారణమని విమర్శించారు. ఇందిరమ్మ గృహాల పేరుతో పట్టణ ప్రాంతాలకు కూడా ఇసుకను తరలిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.

కొన్ని గ్రామాల్లో గ్రామాభివృద్ధి పేరుతో ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా మండల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. రాత్రి వేళల్లో కూడా టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా కొనసాగుతున్నప్పటికీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

అక్రమ ఇసుక రవాణాను వెంటనే అరికట్టాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులను మారేపల్లి మల్లేష్ డిమాండ్ చేశారు. సహజ వనరులను పరిరక్షించేందుకు అక్రమ ఇసుక రవాణాపై తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.