Forest Conservation | అడవుల సంరక్షించండి..

ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్‌కు మంత్రి కొండా సురేఖ దిశానిర్దేశం
అటవీ, పర్యావరణ శాఖలను మరింత బలోపేతం చేయాలి..
కొత్త బాధ్యతలు చేపట్టిన శైలజా రామయ్యర్‌కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

Forest Conservation | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల నూతన ప్రధాన కార్యదర్శి (ప్రిన్సిపల్ సెక్రటరీ)గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శైలజా రామయ్యర్ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శైలజా రామయ్యర్‌కు మంత్రి కొండా సురేఖ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె నాయకత్వంలో అటవీ, పర్యావరణ శాఖలు మరింత సమర్థవంతంగా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా సాధించాలని ఆకాంక్షించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్దేశించిన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలకు అనుగుణంగా శాఖలు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా వనమహోత్సవ కార్యక్రమాల విజయవంతమైన అమలు, అడవుల విస్తీర్ణం పెంపు, వన్యప్రాణులు, జీవవైవిధ్య పరిరక్షణ, అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణ, అటవీ సంరక్షణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వంటి అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు.

అటవీ, పర్యావరణ శాఖలను మరింత బలోపేతం చేసే దిశగా సమగ్ర కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని మంత్రి సూచించారు. అనంతరం శాఖల ఆధ్వర్యంలో ప్రస్తుతం అమలవుతున్న వివిధ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మధ్య సంక్షిప్తంగా చర్చ జరిగింది.