Donkey Wedding | గాడిదలకు ఘనంగా పెళ్లి..
ఆహ్వాన పత్రికలతో వినూత్నంగా కార్యక్రమం
వర్షాభావంతో రైతుల ఆందోళన..
సంప్రదాయాన్ని కొనసాగించిన కర్ణాటక గ్రామం
గాడిదలకు పేర్లు పెట్టి శాస్త్రోక్తంగా వివాహం..
అతిథులకు విందు భోజనాల ఏర్పాటు
Donkey Wedding | బెళగావి: వర్షాలు కురవక పంటలు ఎండిపోతుండటంతో కర్ణాటకలోని బెళగావి జిల్లా మూడలగి తాలూకా మున్యాళ గ్రామ ప్రజలు సంప్రదాయ విశ్వాసం ప్రకారం గాడిదలకు వివాహం జరిపించారు. గ్రామంలో మంచి వర్షాలు కురవాలని కోరుకుంటూ ఈ వినూత్న కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకను ప్రత్యేకంగా నిర్వహించిన గ్రామస్తులు మగ గాడిదకు ‘కాంతేశ్’, ఆడ గాడిదకు ‘కస్తూరి’ అని పేర్లు పెట్టి శాస్త్రోక్తంగా వివాహం చేశారు. అంతేకాదు, ఈ వివాహానికి ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికలను ముద్రించి గ్రామస్థులు, బంధుమిత్రులకు పంపిణీ చేయడం విశేషం.
వివాహ వేడుకలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయ పద్ధతిలో కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పెళ్లికి హాజరైన అతిథులకు విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు.
గ్రామ పెద్దలు మాట్లాడుతూ, ఈ ఏడాది తగినంత వర్షపాతం లేక పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, వర్షాలు కురవాలనే ఆకాంక్షతో పూర్వీకుల కాలం నుంచి వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తూ గాడిదలకు వివాహం జరిపించినట్లు తెలిపారు. శాస్త్రీయంగా దీనికి ఆధారాలు లేకపోయినా, ప్రకృతి అనుకూలించాలని కోరుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
