భారతదేశ వైభవ సాధనకు నిరంతరం దీక్షాబద్ధులం కావాలి
శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ : పరమ తత్వమే గురుత్వం. గురుపూజ అంటే స్వరూప జ్ఞానం పొందడం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ సహ ప్రాంత ప్రచారక్ జనార్దన్ అన్నారు. శ్రీకాకుళం లో ఆర్ఎస్ఎస్ నిర్వహించిన గురుపూజ ఉత్సవ సభ ప్రధాన వక్తగా ఆయన ప్రసంగించారు. జాతీయ జీవనానికి, హిందూ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన పరమ పవిత్ర భగవద్ ధ్వజాన్ని శ్రేష్ఠ గురువుగా స్వీకరించామన్నారు. మన భారతదేశ వైభవ సాధనకు నిరంతరం దీక్షాబద్ధులం కావాలని పిలుపునిచ్చారు . తనువు, మనసు, ధనం అన్నీ ఆ మాతకే సమర్పించాలన్న భావనను అంతటా నిర్మాణం చేయాల్సిన శుభ తరుణం ఇదేనన్నారు. విజయనగరం విభాగ్ సహ సంఘ్ చాలక్ ఎం. గణపతిరావు, శ్రీకాకుళం జిల్లా సంఘ్ చాలక్ పి. రమణమూర్తి, శ్రీకాకుళం నగర సంఘ చాలక్ డాక్టర్ కింజరాపు అమ్మన్నాయుడు, ముఖ్య అతిథిగా అర్జునన్ నాగరాజన్ (వంశధార పేపర్ మిల్స్- శ్రీకాకుళం) పాల్గొన్నారు. జనార్దన్ మాట్లాడుతూ, ఇహ పరాల అనుసంధానమే కాషాయ ధ్వజమన్నారు. త్యాగంతోనే పరిపూర్ణత లభిస్తుందని, అందరం జాతీయ పునర్ నిర్మాణ మహా యజ్ఞాన్ని సాగించాలని తెలిపారు. పద్యపఠనం, గీతాగానంతో ఆయన చేసిన ఉపన్యాసం ఎంతగానో ఆకట్టుకుంది.
