వర్గల్ రహదారి మరమ్మతులు పూర్తయ్యే వరకు పోరాటం

  • గ్రామ సర్పంచ్ జయభారతి

వర్గల్, ఆంధ్రప్రభ: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన వర్గల్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి దెబ్బతిన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని గ్రామ సర్పంచ్ జయభారతి అన్నారు.

రాజీవ్ రహదారి నుంచి దండుపల్లి జాతీయ రహదారిని కలిపే ప్రధాన రహదారి వర్గల్ మండల కేంద్రం మీదుగా వెళ్తుందని, ఇటీవల కురిసిన వర్షాలకు రహదారి పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు. రహదారి మరమ్మతుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

సోమవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద దెబ్బతిన్న రహదారిపై చేపట్టిన నిరసన దీక్షా శిబిరాన్ని ఆమె సందర్శించి మద్దతు తెలిపారు. దీక్షలో పాల్గొని ఆందోళనకారులకు సంఘీభావం ప్రకటించారు.

రోడ్డును పూర్తిగా బాగు చేసే వరకు పట్టు విడిచేది లేదని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని సర్పంచ్ జయభారతి స్పష్టం చేశారు.