Sircilla కేసులను త్వరితగతిన ఛేదించాలి

Sircilla కేసులను త్వరితగతిన ఛేదించాలి

  • దర్యాప్తులో ఆధునిక సాంకేతికత వినియోగించాలి: ఎస్పీ మహేష్ బి. గితే

సిరిసిల్ల( Sircilla) , ఆంధ్రప్రభ:

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేరాల నియంత్రణతోపాటు నమోదైన కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు నిర్వహించి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం సిరిసిల్ల సబ్‌డివిజన్ పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

జిల్లాలో సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి నేరాల నివారణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించి నేరాల దర్యాప్తు, నేరస్తుల గుర్తింపు, కేసుల నిర్వహణలో వేగం, పారదర్శకత పెంచాలని చెప్పారు.

సీసీటీఎన్‌ఎస్ 2.0, ఈ-సాక్ష్య వ్యవస్థలను పూర్తిస్థాయిలో వినియోగించి డిజిటల్ ఆధారాల సేకరణ, భద్రపరిచే ప్రక్రియను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. సివిల్, భూ వివాదాల విషయంలో అనుసరించాల్సిన ప్రామాణిక విధానాలపై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని సూచించారు.

దొంగతనాల నివారణ కోసం ప్రతి సర్కిల్ పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పటిష్ట చర్యలు చేపట్టాలని ఎస్పీ పేర్కొన్నారు. గంజాయి, ఇసుక, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

గతంలో గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై నిరంతర నిఘా ఉంచాలని, గంజాయి పరీక్షా కిట్ల సహాయంతో యూరిన్ పరీక్షలు నిర్వహించి మాదకద్రవ్యాలు వినియోగించే వారిని, సరఫరా చేసే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో రోజూ సాయంత్రం వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానాన్ని అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, మహిళల భద్రత వంటి అంశాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ సమావేశంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, వెంకటేష్, మొగిలి, ఎస్‌ఐలు, ఐటీ కోర్ సిబ్బంది, డీసీఆర్‌బీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply