Shoealls AP Investment | ఏపీలో షూఆల్స్ యూనిట్‌కు గ్రీన్ సిగ్నల్
త్వరగా ప్రారంభించండి..
సియోల్‌లో ఏపీ మంత్రి లోకేశ్ కీలక సమావేశం
యూనిట్ త్వరితగతిన ప్రారంభించాలని విజ్ఞప్తి
3 వేల మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్టు
Shoealls AP Investment | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదిత పారిశ్రామిక పెట్టుబడులను వేగవంతం చేసే దిశగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియా పర్యటనలో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దక్షిణ కొరియాకు చెందిన సర్టిఫైడ్ స్మార్ట్ హెల్త్‌కేర్ ఫుట్‌వేర్ తయారీ సంస్థ షూఆల్స్ (Shoealls) కంపెనీ లిమిటెడ్ ఛైర్మన్, సీఈవో లీ చియాంగ్-గెన్‌తో సియోల్‌లో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఇప్పటికే కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం (ఎంవోయూ) మేరకు రాష్ట్రంలో ప్రతిపాదిత పాదరక్షల తయారీ యూనిట్ ఏర్పాటుకు సంబంధించిన పనులను వేగంగా ప్రారంభించాలని నారా లోకేశ్ సంస్థ ప్రతినిధులను కోరారు. రూ.300 కోట్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న ఈ తయారీ యూనిట్ ద్వారా సుమారు 3,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అనుమతులు, వ్యాపార అనుకూల వాతావరణాన్ని కల్పించేందుకు పూర్తి సహకారం అందిస్తుందని లోకేశ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. సమావేశంలో ప్రాజెక్టు అమలు, పెట్టుబడుల పురోగతి, భవిష్యత్ విస్తరణ అవకాశాలపై కూడా చర్చించినట్లు వెల్లడైంది.

